విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కల్లుకుంట గ్రామ సమీపంలో ఉన్న సూగూరు మేజరు కాలువ నుంచి ఎదలగట్టు పొలాలకు వెళ్లే దారిని కాపాడాలని మంగళవారం కల్లుకుంట రైతులు తహసీల్దార్ గీతా ప్రియదర్శినికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు జాన్, ఈరన్న, అళ్లప్ప, అబ్రహంలు మాట్లాడుతూ గతంలో ఈ రహదారిపై పొలాలకు మనుషులు, ఎద్దుల బండ్లు వెళ్లేవన్నారు. కానీ నేడు రహదారిని ఇరువైపుల ఉన్న రైతులు ఆక్రమించి ఇరుకుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల రాకపోకలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కావున తక్షణమే అధికారులు స్పందించి రహదారిని పునరుద్ధరించాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు తిక్కన్న, లసుమన్న, ఉరుకుందప్ప, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.


