రేవంత్‌తో పాటు వంశీచంద్ రెడ్డి, దామోదర రాజనర్సింహ
సాయంత్రం సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్న నేతలు
ఖర్గే అధ్యక్షతన భేటీ… హాజరుకానున్న సోనియా, రాహుల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో అమరావతికి బయల్దేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఇవాళ సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తినకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఈ భేటీకి తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా హాజరుకానున్నారు. సీడబ్ల్యూసీ భేటీలో పలు జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
వీటితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి అంశాలు, కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతి వంటి విషయాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత వంశీచంద్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్నారు.