ప్రశంసలు కురుపించిన సూర్య కుమార్
క్రీడలు: టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ (97*) బ్యాట్‌తో రాణించాడు. టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి, సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. మేం ఆడిన విధానంతో మాకు చాలా ఆనందంగా ఉంది. చావోరేవో తేల్చుకోవాల్సిన క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా క్రికెటర్లు అద్భుతంగా ఆడారు. ఓపికగా ఎదురుచూసిన మంచి మనుషులకు మంచే జరుగుతుంది. ఇదంతా అతడి (సంజు శాంసన్) హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది. అతడు ఆడిన విధానం జట్టుకు విజయాన్ని అందించింది’ అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. అలాగే బౌలర్ల గురించి కూడా అతడు మాట్లాడాడు. ‘మా బౌలర్లు ప్రణాళిక ప్రకారమే బంతులు సంధించారు. అలాగే బ్యాటర్లు కూడా బాగా ఆడారు. భాగస్వామ్యాలే కీలకమయ్యాయి. క్రికెట్‌లో ఒత్తిడి సాధారణం. కానీ అలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యంగా బ్యాటర్లు పరుగులు తీయాలి. ఒత్తిడి లేకుండా ఆనందం లేదు’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో సంజుశాంసన్ విఫలమైన విషయం తెలిసిందే. దీంతో టీ20 వరల్డ్‌కప్ 2026లో తుది జట్టులో స్థానం కోల్పోయాడు. కేవలం ఒకటి, రెండు మ్యాచుల్లో మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. అయితే వాటిలోనూ పెద్దగా స్కోర్లు చేయలేదు. కానీ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ అతడిని వరల్డ్ క్లాస్ ఆటగాడని అభినందించాడు. సంజు శాంసన్ ఓ వరల్డ్ క్లాస్ ప్లేయర్. అతడు ఎంత మంచి క్రికెటరో మనందరికీ తెలుసు. అందుకే మేం అతడికి మద్దతుగా నిలిచాం. జట్టుకు అవసరమైన సమయంలో తన సత్తా చాటాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో తన సామర్థ్యాన్ని చూపించాడు. మిగిలిన మరో రెండు మ్యాచుల్లోనూ అతడు ఇలాగే రాణించాలని కోరుకుంటున్నా. సంజు శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్.. వీరిద్దరూ ప్రస్తుతం టీమ్ఇండియాకు కీలకమైన ఆటగాళ్లు. భవిష్యత్తులోనూ వీరు ఇలాగే పరుగులు రాబట్టాలి’ అని గంభీర్ పేర్కొన్నాడు.


