నేడు క్రూడ్ ఆయిల్ నౌక ‘జగ్ లడ్కీ’ రాక
కాండ్లా పోర్టుకు గ్యాస్ నౌక ‘నందాదేవి’
దిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ దేశంలో ఇంధన సరఫరాపై ఆందోళన నెలకొన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎల్పీజీని మోసుకొచ్చిన ‘శివాలిక’ ట్యాంకర్ సోమవారం భారత్‌లోని గుజరాత్ ముంద్రా పోర్ట్‌కు చేరుకుంది. శివాలిక్ నౌకలో 45 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ భారత్‌కు వచ్చిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 80 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్‌తో వస్తోన్న ‘జగ్ లడ్కీ’ నౌక మంగళవారం భారత్‌కు చేరుకుంటుందని నౌకాయాన మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా వెల్లడించారు. పర్షియన్ గల్ఫ్‌కు పశ్చిమాన 22 భారత నౌకలు ఉన్నాయని, వాటిల్లో 616 మంది నావికులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. హర్మూజ్ జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా… ఈ మార్గంలో భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు భారత జెండాలు ఉన్న ఎల్పీజీ నౌకలు రెండురోజుల క్రితం సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయి. అందులో ఒకటి శివాలిక్ కాగా.. మరొకటి నందాదేవి. శివాలిక్ తాజాగా భారత్ చేరుకోగా.. మంగళవారం ఉదయం ‘నందాదేవి’ కూడా 45 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను తీసుకొని కాండ్లా పోర్టుకు రానుంది.


