- అనుమతి పొందిన ప్రతి వాహనానికి విండ్‌స్క్రీన్‌పై పర్మిట్ తప్పనిసరి
- అక్రమ రవాణాలో పట్టుబడితే రీచ్ అనుమతులూ రద్దు
- రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల సంయుక్త దాడులు.. కలెక్టర్. ఎస్పీ
విశాలాంధ్ర -తిరుపతి కలెక్టరేట్: జిల్లాలో ఇసుక, కంకర (గ్రావెల్) అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, మైనింగ్, పోలీస్, రవాణా, నీటిపారుదల శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ., అనుమతి పొందిన ప్రతి వాహనం విండ్‌స్క్రీన్‌పై పర్మిట్ ప్రదర్శించడం తప్పనిసరి అని, ఆన్‌లైన్ బిల్లు, అనుమతి పత్రాలతోనే ఖనిజాల రవాణా జరగాలని ఆదేశించారు. అక్రమ తవ్వకాలు, రవాణాలో పట్టుబడిన వాహనాలపై కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అనుమతి పొందిన రీచ్‌కు చెందిన వాహనం అక్రమ రవాణాలో పట్టుబడితే సంబంధిత రీచ్ అనుమతిని రద్దు చేయడంతో పాటు అవసరమైతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మాట్లాడుతూ., అక్రమ ఇసుక, కంకర రవాణాపై రెవెన్యూ, మైనింగ్ శాఖలతో సమన్వయంగా సంయుక్త దాడులు నిర్వహిస్తామని తెలిపారు. సరిహద్దు ప్రాంతాలు, చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీవోలు రామ్మోహన్, భానుప్రకాశ్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, జిల్లా రవాణా అధికారి మురళీ మోహన్, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్లు (తిరుపతి, చిత్తూరు నెల్లూరు, చెన్నై), నీటిపారుదల శాఖ ఎస్‌ఈ, ఈఈలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


