దిల్లీ: టీమ్ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీపై అతడి భార్య హసిన్ జహాన్ గృహహింస, భరణం కేసు పెట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతా నుంచి ఆ కేసును దిల్లీకి బదిలీ చేయాలని ఆమె తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు మహ్మద్ షమీకి నోటీసు జారీ చేసింది. మహమ్మద్ షమీ, హసిన్ జహాన్ 2014లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2015లో ఒక కుమార్తె జన్మించింది. 2018లో షమీపై జహాన్ గృహహింస ఆరోపణలు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు షమీపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. హసిన్ పిటిషన్‌పై స్పందించాలని షమీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి జస్టిస్ మనోజ్ మిశ్రా, ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తన కూతురుకు మంచి విద్య అందించడం కోసం తాను ప్రస్తుతం దిల్లీలో నివాసముంటున్నానని ఆమె తెలిపారు. దీంతో తాము కోర్టు కేసుల కోసం పశ్చిమబెంగాల్ రావడానికి ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. షమీ ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ అని, అతడు మ్యాచ్‌లు ఆడేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తుంటాడని తెలిపారు. దీంతో కేసును దిల్లీకి మార్చినా అతడికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో తన కుటుంబం నివసిస్తున్న ప్రాంతం.. కోల్‌కతా కంటే దిల్లీకి భౌగోళికంగా దగ్గరగా ఉందని తెలిపారు. ఈ కారణంగా, కేసును రాజధానికి బదిలీ చేస్తే.. కోర్టుకు హాజరుకావడం తనకు సులభం అవుతుందని ఆమె వాదించారు.తన భరణం మొత్తాన్ని గణనీయంగా పెంచాలని కోరుతూ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొన్ని నెలల తర్వాత ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. తనకు, తన కుమార్తెకు నెలవారీ జీవనాధారాన్ని రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ఆమె అభ్యర్థించిన విషయం తెలిసిందే.
మహ్మద్ షమీకి సుప్రీం నోటీసులు
- Advertisement -
RELATED ARTICLES


