పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజు తెరపడింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా, ఆమె రాజకీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి… ఈరోజు అదే బెంగాల్ గడ్డపై ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమత దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకుని, చివరకు ఆమెనే ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఒక పక్కా పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సువేందు అధికారి ప్రస్థానం నిజంగానే అద్భుతమని చెప్పొచ్చు. నందిగ్రామ్, భవానీపూర్ ఉద్యమాల్లో మమతకు వెన్నెముకగా నిలిచిన ఆయన, నేడు ఆమె కూర్చున్న కుర్చీలోనే ముఖ్యమంత్రిగా ఆసీనులయ్యారు. బెంగాల్ ఓటర్లు ఆయనకు పట్టం కట్టడం ద్వారా రాష్ట్రంలో ఒక కొత్త శకానికి నాంది పలికారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువుకు అగ్ర నేతలు స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


