Homeక్రీడలుఅన్ని వేదికల్లోనూ టెస్టులు జరగాలి

అన్ని వేదికల్లోనూ టెస్టులు జరగాలి

- Advertisement -

కోల్‌కతాలో టెస్ట్ మ్యాచ్‌లు జరిగితే సంతోషిస్తా
బీసీసీఐకే తన మద్దతు: గంగూలీ

కోల్‌కతా: క్యాబ్ అధ్యక్షుడిగా కోల్‌కతాలో టెస్టు మ్యాచ్‌లు జరిగితే సంతోషిస్తాను, కానీ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మ్యాచ్‌లు జరగాలని కోరుకుంటానని టీమఇండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. టీమఇండియా 2026-27 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల వేదికలనూ వెల్లడించింది. ఈడెన్ గార్డెన్స్‌ను కాదని…ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు గువాహతి వేదికగా నిలిచింది. మరో పెద్ద నగరం ముంబైలోని వాంఖడేలోనూ టెస్టు మ్యాచ్ జరగడం లేదు. దీంతో బీసీసీఐ నిర్ణయాలపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నాగ్‌పుర్, చెన్నై, గువాహతి, రాంచీ, అహ్మదాబాద్ వేదికగా ఐదు టెస్టులు జరగనున్నాయి. ఈ క్రమంలో గంగూలీ స్పందించాడు. అయితే బీసీసీఐ నిర్ణయాన్ని గంగూలీ పూర్తిగా సమర్ధించాడు. ఈ విషయంలో తన మద్దతు బీసీసీఐకేనని స్పష్టంచేశాడు. “ఈడెన్ గార్డెన్స్‌లో పెద్ద జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరగాలని కోరుకుంటా. మాజీ క్రికెటర్‌గా… క్యాబ్ అధ్యక్షుడిగా కోల్‌కతాలో టెస్టు జరిగితే సంతోషిస్తా. అక్కడ దక్షిణాఫ్రికాతో టెస్టు జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచులు జరిగాయి. ఐపీఎల్‌లోనూ ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడ నిర్వహించడం ఎంత ముఖ్యమో…మిగతా వేదికలకూ అవకాశం ఇవ్వడం అంతే కీలకం. సంప్రదాయ వేదికలతోపాటు మిగతా మైదానాల్లోనూ ఆడించాలి. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ స్టేడియాలు చాలా బాగున్నాయి. చెన్నైలో టెస్టు మ్యాచ్‌నూ ఆస్వాదిస్తా. గువాహతి, రాంచీలోనూ నిర్వహించడం అభినందనీయం. అన్ని చోట్లా సదుపాయాలు బాగున్నాయి. మేం ఆడేటప్ప్పుడు కోల్‌కతా, కాన్పూర్, చెన్నై, దిల్లీ, ముంబైలో టెస్టులు జరిగేవి. ఇప్పటికీ అక్కడ మ్యాచ్ నిర్వహిస్తే అభిమానుల సందడి ఎక్కువగానే ఉంటుంది. టీ20లు, వన్డేలు ఒకెత్తు అయితే… ఐదు వేదికల్లో టెస్టులు చాలా స్పెషల్. ఈడెన్ గార్డెన్స్‌లో టెస్టు క్రికెట్ ఆడటం ఎప్పటికీ గౌరవమే’ అని గంగూలీ తెలిపాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు