విశాలాంధ్ర పుట్టపర్తి: – కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రైతు పోరు బాట కార్యక్రమంలో భాగంగా గణేష్ కూడలిలోని వైయస్సార్సీపి పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి బయటాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎరువులు అందకుండా చేసి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని, దీని వెంటనే అరికట్టి రైతులను ఆదుకోవాలన్నారు . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు. ఎరువులు, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న రైతాంగ సమస్యలు పరిష్కరించాలన్నారు. బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పి కోత విధిస్తున్నారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా ఒక ఏడాది రైతులకు అందకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అనర్హులు ఉన్నారని సాకు చూపుతూ ఇష్టం వచ్చినట్లు పింఛన్లు తొలగించారని, శ్రీనిధి రుణాలు ఇతర సంక్షేమ పథకాలు అన్నింటిని ప్రభుత్వం కోత విధిస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి అమరావతి మీద ప్రేమ తప్ప మిగతా ఏ జిల్లా అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదన్నారు. రాయలసీమ వాసి ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాయలసీమ అభివృద్ధిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని భవిష్యత్తులో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మండల కన్వీనర్లు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం
- Advertisement -
RELATED ARTICLES


