శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యం
-సమితి నగర అధ్యక్షులు
డా. గన్ని భాస్కరరావు
విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ : శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆర్ ఎస్ ఎస్ పనిచేస్తోందని హిందూ సమ్మేళనం సమితి నగర అధ్యక్షులు, జి ఎస్ ఎల్ సంస్థల చైర్మన్ డా.గన్ని భాస్కరరావు చెప్పారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించేందుకు శుక్రవారం ఉదయం స్థానిక ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మరో వందేళ్లు హిందూ సమాజాన్ని చైతన్యవంతంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు డా. భాస్కరరావు చెప్పారు. ఆర్ఎస్ఎస్ చేసే కార్యక్రమాలకు తోడుగా ఊళ్లోని ప్రముఖులతో హిందూ సమ్మేళనం ఏర్పాటుచేసి, హిందూసమాజంలో చైత్యాన్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఏదైనా రాజమహేంద్రవరం నుంచే ప్రారంభించాలన్న నానుడి ఉందని డా. భాస్కరరావు చెబుతూ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాబోయే గోదావరి పుష్కరాల్లో కూడా రెడ్ క్రాస్ వంటి సంస్థలతో కల్సి ఎలా పనిచేయాలో ఆలోచన చేస్తామన్నారు. ఆర్ ఎస్ ఎస్ ప్రతినిధి ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ హిందువులను చైతన్య పరిచి, శక్తివంతం చేయడం, సాంస్కృతిక పునరుజ్జీవనం చేయడానికి గడిచిన వందేళ్లుగా ఆర్ ఎస్ ఎస్ దేశంలో పనిచేస్తోందని చెప్పారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ శాఖతో ప్రశిక్షణ లక్ష స్థలాల్లో పూర్తిస్థాయి యూనిఫారంతో కార్యక్రమాలు జరిగాయని ఆయన చెప్పారు. విజయదశమి నాటికి దేశంలోని అన్ని గ్రామాల్లో, అన్ని బస్తీల్లో శాఖల నిర్వహణ సాగేలా చూడడం వంటి కీలక నిర్ణయాలను ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల సందర్బంగా తీసుకుని పనిచేస్తున్నట్లు ఓలేటి వివరించారు. బండ్ల శంకర్ స్వాగతం పలుకగా ఆర్ సుబ్బారావు, డి హెచ్ పి శాస్త్రి, గొర్రెల సురేష్, తదితరులు పాల్గొన్నారు.


