వేలాదిమంది భక్తుల శివనమస్మరణలతో మార్మోగిన గవిమఠ ప్రాంగణం
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠం శ్రీచంద్రమౌళీశ్వర స్వామి వారి రథోత్సవం గురువారం సాయంత్రం వేలాదిమంది భక్తుల కోలాహలాల మధ్య నేత్రపర్వంగా, వైభవంగా జరిగింది. రథోత్సవానికి భారీగా భక్తులు తరలిరావడంతో గవిమఠ ప్రాంగణం కిటకిటలాడింది. ప్రత్యేక పూజలు అనంతరం రథాన్ని లాగారు. రథోత్సవం సందర్భంగా గవిమఠం పీఠాధిపతి శ్రీచెన్నబసవ రాజేంద్ర స్వామి, ఉత్తరాధికారి శ్రీకరిబసవ రాజేంద్ర స్వామి, ఆదోని చౌకి మఠం మఠాధిపతి శ్రీకల్యాణి స్వామి, గవిమఠం సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు తెల్లవారుజామునుండి శ్రీచంద్రమౌళీశ్వర స్వామికి, గవిసిద్దేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి రథంపై కొలువు దిర్చారు. శ్రాస్త్రోక్తంగా పూజలు జరిపిన అనంతరం అశేష భక్త జనవాహిని చేసిన శివ నమస్మరణల మధ్య చంద్రమౌళీశ్వర స్వామి వారి మహారథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు పూలు, పండ్లు రథంపై విసిరి తమ మొక్కులను తీర్చుకుని భక్తిని చాటుకున్నారు.స్వామి వారి మూల విరాట్ ను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అనంతపురం జిల్లా వాసులే కాకుండా ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు రథోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ అధికారులు పాలకవర్గ సభ్యులు రథోత్సవాన్ని అలంకరించడానికి పూల హారాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు, గవిమఠం ఏజెంట్ రాజన్న గౌడ్, వీరశైవ సంఘం నాయకులు, ఆలయ సిబ్బంది,అర్చకులు పాల్గొన్నారు.


