విశాలాంధ్ర -అనంతపురం : భారత కమ్యునిస్టు పార్టీ మైనారిటీ వింగ్ “ఇన్సాఫ్” నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ , గౌరవ అధ్యక్షులు అల్లి పీరా , అధ్యక్షులు చాంద్ బాషా మాట్లాడుతూ… రోడ్ వైడనింగ్ లో భాగంగా ఈద్గా మసీదు కాంప్లెక్స్ విషయంలో ఎన్.హెచ్.ఏ వారు తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసినదే అని పేర్కొన్నారు. గత సంవత్సరం ఇదే విషయమై మైనారిటీలు అందరూ కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ అనంతపురం విచ్చేసినపుడు ,మసీదు కాంప్లెక్స్ లేని పక్షంలో జరిగే నష్టాలను వారి దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగిందని పేర్కొన్నారు. వారు సానుకూలంగా స్పందించి కాంప్లెక్స్ విషయం లో పునరాలోచన చేస్తాను అని మాట ఇవ్వడం జరిగిందన్నారు. గత వైకాపా ఎంపీ తలారి రంగయ్య కి కూడా వినతి పత్రం అందజేయడంతో వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. ఈ విషయమై మంగళవారం నగరంలోని పలువురు మైనారిటీలు , కాంప్లెక్స్ లోని షాపు లో అద్దెకు ఉంటున్న వారు, ముస్లిం సంఘాలు , ఇమాము లు ఈద్గా మసీదు నందు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగిందన్నారు.సంబంధిత అధికారులు మసీదు వద్దకు చేరుకుని పారదర్శకత చూపించకుండా కేవలం ఒకరిద్దరితో చర్చించి వారి మాటే వేదం అనుకుని వెళ్లిపోవడం జరిగిందన్నారు. అక్కడికి తమ తమ ఆలోచనలు, అభ్యర్థనలు వినిపించటానికి వచ్చిన వారితో చర్చలు జరుపలేదన్నారు. ఈ విషయం పై చాల మంది ముస్లిం నాయకులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఏక పక్ష నిర్ణయాలకు తావు ఇవ్వకుండా అన్ని ముస్లిం సంఘాలకు, అన్ని పార్టీల ముస్లిం నాయకుల మరియు అఖిల పక్ష పార్టీల నాయకుల అభిప్రాయాల స్వీకరణ కొరకు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని , అందరినీ పిలిపించి ఈద్గా మసీదు కాంప్లెక్స్ విషయం పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హాజీ వలి, రహంతుల్లా , ఖాజా మొహిద్దీన్, దాదు, తదితరులు పాల్గొన్నారు .