◆క్వారీలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి
◆ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం
◆చనిపోయిన వారు ఒడిశా వాసులుగా గుర్తింపు
◆నిబంధనలు పాటించకనే ప్రమాదానికి కారణమా
◆సహాయక చర్యలు చేపట్టిన పోలీసు యంత్రాంగం
◆బల్లికురవ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ పరిశ్రమలో ఘటన
విశాలాంధ్ర; బల్లికురవ-మండలం లో సత్యకృష్ణ గ్రానైట్ పరిశ్రమలో
వారంతా ఒడిశా నుంచి వచ్చిన వలసజీవులు. పొట్టకూటి కోసం కుటుంబ సభ్యులకు దూరంగా పరాయి రాష్ట్రం నుంచి వచ్చి, ఓ గ్రానైట్ క్వారీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మామూలుగా ఆదివారం ఆటవిడుపుగా సెలవు తీసుకుంటారు. కానీ, వారికి పనితోనే కాలక్షేపం అనుకుంటా. ఆరోజు కూడా పనికి వెళ్లిన కార్మికులకు అదే చివరి రోజు అవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. క్వారీలోని బండరాళ్ల రూపంలో వలసజీవుల బ్రతుకులను చిదిమేసింది. ఒకరు కాదు, ఇద్దరు అంతకన్నా కాదు. ఏకంగా ఆరుగురిని బలితీసుకుంది. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు కూడా. ఇంతంటి పెను విషాదకరమైన సంఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం పరిధిలోని ఓ క్వారీలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
అందిన సమాచారం ప్రకారం..
బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలో సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. క్వారీ అంచు విరిగిపడి అందులో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన కార్మికులు నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో 16 మందికి పైగా గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు సమాచారం. వీరంగా ఆరోజు ఉదయం పనిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బండరాళ్లను పగులగొట్టే పనిలో ఉన్నారు. ఇంతలో ఓ పెద్దరాయి ప్రమాదవశాత్తూ జారిపడినట్లు విశ్వసనీయ సమాచారం. ఈప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడగా, వారిని ఒంగోలు, అద్దంకి ఆస్పత్రికి తరలించారు. ఇంకా రాళ్ల కింద పడిన వారిని వెలికి తీసే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమయ్యారు. మృతుల వివరాలతో పాటు ప్రమాదానికి గల కారణాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది.
◆ నిబంధనలకు తిలోదకాలు..
గ్రానైట్ పరిశ్రమలలో నిబంధనలు పాటించకనే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అందులో పనిచేసే కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం ఉందని తెలిసినా కూడా కార్మికులతో పని చేయించడం ఏమిటి అని సర్వత్రా నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. వలసజీవుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, పాలకులకు పట్టదాని ప్రశ్నిస్తున్నారు. ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం అందించి, వారిని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


