— ఎస్ టి యు డిమాండ్
విశాలాంధ్ర–తాడేపల్లిగూడెం : ఉపాధ్యాయుడిగా తనను తాను పరిచయం చేసుకోవడానికి కార్యాలయానికి వెళ్లిన తన పట్ల ఎంఈవో వి. హనుమ అసహనంగా వ్యవహరించారని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వేదాల ఉదయ్ కుమార్ ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెం కపర్థీ భవన్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ మండల విద్యాశాఖ అధికారి అయి ఉండి ఆ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఎస్జీటీ ఉపాధ్యాయుడితో ఇతర పనులకు వినియోగించరాదని కమిషనర్ ఆదేశాలు ఉన్నాయన్నారు. నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఎస్జీటీ ఉపాధ్యాయుడిని అసభ్య పదజాలంతో పిలవడం దారుణమన్నారు. దీనిపై ప్రశ్నించడం జరిగిందన్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 15వ తేదీన ఒక ఉపాధ్యాయిని చైల్డ్ కేర్ సెలవు విషయంపై ఎంఈవో కార్యాలయానికి వెళ్ళామన్నారు. అయితే, అదే రోజు రాత్రి ఎంఈవో వి. హనుమ తనకు ఫోన్ చేసి ఇష్టా రీతిగా దుర్భాషలాడారని ఆరోపించారు. తదుపరి రోజు ఈ విషయమై జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి, ఎస్టీయు నాయకత్వానికి విన్నవించామన్నారు. అయినా, కలెక్టర్, డీఈవో నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ ఉపాధ్యాయినిల పట్ల సైతం అసభ్యంగా ప్రవర్తించడంతో ఆయనతో మాట్లాడేందుకు సైతం వారు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. ఎంఈవోను సస్పెండ్ చేయాలని ఎస్టీయూ తరఫున డిమాండ్ చేశారు. ఎస్ జి టి ఉపాధ్యాయుడు కే గంగరాజు మాట్లాడుతూ 6 ఏళ్ల వేతన స్కేలు స్థిరీకరణ విషయంలోనూ సదరు ఎంఈవోకు సొమ్ములు ఇస్తే పని అయిపోతుందని ఒక ఉపాధ్యాయుడు చెప్పడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయకుండా షోకాజ్ నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన బాధ భరించలేక డిప్యూటేషన్ పై కస్పా పెంటపాడు వెళ్లినట్లు తెలిపారు. ఎంఈవో తీరు బాగోలేదని తెలిపారు. ఎస్ టి యు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కొడమంచిలి శ్రీనివాస్, కంకిపాటి గంగరాజు, పెంటపాడు మండల శాఖ అధ్యక్షుడు పైడారావు, ఉపాధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు, పెంటపాడు మండల కార్యవర్గ సభ్యుడు రజనీకాంత్, నూకారపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


