Homeనియోజకవర్గాల పునర్విభజన అంతా రాజకీయమే

నియోజకవర్గాల పునర్విభజన అంతా రాజకీయమే

- Advertisement -

. పార్లమెంటులో వ్యతిరేకంగా ఓటేస్తాం
. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు
. ‘ఇండియా’ నేతల నిర్ణయం
. నేటి నుంచి పార్లమెంట్ప్ర త్యేక సమావేశం

న్యూదిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు`2026ను తీవ్రంగా వ్యతిరేకించాలని… బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా ఐక్య సంఘటన ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము అనుకూలంగా ఉన్నామని కూడా స్పష్టంగా పేర్కొంది. అయితే, దానిని తీసుకువచ్చిన విధానం ప్రశ్నార్థకంగా ఉందని, దానిపై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని స్పష్టం చేసింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల బిల్లుల్ని ఆమోదించడం కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గురువారం నుండి మూడురోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సెషన్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా, కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌పై దేశ వ్యాప్తంగా ఇప్పటికే దుమారం రేగింది. ఈక్రమంలో ఇండియా ఐక్యసంఘటన భాగస్వామ్య పక్షాల నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖడ్గే నివాసంలో బుధవారం సమావేశమయ్యారు. డీలిమిటేషన్ బిల్లుపై ఏవిధంగా ముందుకు వెళ్లాలనేదానిపై చర్చించారు. దీనిపై కేంద్రానికి గట్టిగా సమాధానం చెప్పాలని ‘ఇండియా’ తన అస్త్ర, శస్త్రాలను సిద్దం చేసుకుంది. సమావేశం అనంతరం ఖడ్గే… ఇతర నాయకులతో కలిసి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశంపై మాట్లాడారు. “మేమందరం మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగానే ఉన్నాము. అయితే, దీనిని తీసుకువచ్చిన విధానం ప్రశ్నార్థకంగా ఉంది, దీనిపై మాకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. ఇది రాజకీయ ప్రేరేపితం. ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుని అణచివేయడానికే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోంది” అన్నారు. ప్రతిపక్షం మహిళా రిజర్వేషన్ బిల్లుకు నిరంతరం మద్దతు ఇస్తూనే ఉందని… గతంలో ఆమోదించిన సవరణ ప్రకారమే దీనిని అమలు చేయాలని పట్టుబట్టిందని ఆయన అన్నారు. “మేము 2010 నుండి మహిళా రిజర్వేషన్ బిల్లుకు నిరంతరం మద్దతు ఇస్తున్నాము, 2023లో కూడా రాజ్యాంగ సవరణ ఏకగ్రీవంగా ఆమోదించబడింది. గతంలో ఆమోదించిన సవరణ ఏదైనా సరే, దానిని అమలు చేయాలని మేము పట్టుబడుతున్నాము” అని ఖడ్గే అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రస్తావిస్తూ… “ప్రభుత్వం కొన్ని కుతంత్రాలు పన్నుతున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా నిలబడి పార్లమెంటులో పోరాడబోతున్నాయి. మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను” అన్నారు. అసోం, జమ్మూకశ్మీర్‌లలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనను ప్రస్తావిస్తూ… ప్రభుత్వం అసోం, కశ్మీర్‌లో జమ్మూకశ్మీర్‌లలోని ప్రతి ఒక్కరినీ మోసం చేసిందని ఖడ్గే ఆరోపించారు. ఒక ప్రశ్నకు సమాధానంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ… “మేము పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తాము” అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్) జైరామ్ రమేశ్ మాట్లాడుతూ… “ఈరోజు అన్ని ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. పార్లమెంటులో ప్రవేశపెడుతున్న మూడు బిల్లులలో, ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు కాగా, రెండు శాసనబద్ధ బిల్లులు. మొత్తంగా ఈ మూడు బిల్లులపై చర్చ జరుగుతుంది. 2023 లో, రాజ్యాంగంలో ఆర్టికల్ 334(ఎ) పొందుపరచబడింది. ఇది ఏకాభిప్రాయంతో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించడానికి వీలు కల్పించింది. ఆ నిబంధనను తక్షణమే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నుంచి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం దీనిని జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టిందని ఆయన అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అత్యంత ప్రమాదకరమని పేర్కొంటూ… “లోక్‌సభలో 50% సీట్లు పెరుగుతాయి. ఇది అన్ని రాష్ట్రాలకు దామాషా ప్రకారం వర్తిస్తుందని హోం మంత్రి, ఇతర మంత్రులు చెప్పారు. కానీ ఈ బిల్లులో ఆ విషయం చేర్చలేదు. ఈ బిల్లు రాకతో, దక్షిణ భారతదేశం, వాయువ్య భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల నిష్పత్తి తగ్గుతుంది” అని స్పష్టం చేశారు. దామాషా అనే పదాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారని…కానీ నియోజకవర్గాల పునర్విభజన నిబంధనలలో అది ఎక్కడా కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఆమ్ ఆద్మీ పార్టీ , రాష్ట్రీయ జనతా దళ్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎంలకు చెందిన నాయకులు హాజరయ్యారు. మరి కొంతమంది నాయకులు వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు