. పోలవరం నీటి వినియోగంపై ముందే ప్రణాళిక
. నేరడి బ్యారేజ్, చింతలపూడి మెయిన్ కెనాల్‌కు త్వరలో టెండర్లు
. జల వనరుల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగానే గోదావరి జలాలను కుడి, ఎడమ కాలువల ద్వారా తరలించి వాటిని ఏయే అవసరాల కు, ఎంత మేర వినియోగించుకోవాలనే దానిపై ఒక నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు అనుసంధా నంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపేలా ప్రణాళిక చేయాలని సూచిం చారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ అధికారులతో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం- నల్లమల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వరికెపూడిశిల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూగర్భ జలాల పెంపు, జల ధార, జల హారతి కార్యక్రమాల పైనా సమీక్షించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులయిన తారక రామ, మహేంద్ర తనయ, తోటపల్లి బ్యారేజ్, మద్దువలస, జంఝావతి, హీరమండలం లిఫ్ట్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. డిసెంబరు నాటికి వంశధార-నాగావళి అనుసంధానం, జులై నాటికి నాగావళి-చంపావతి అనుసంధానం పూర్తి చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా వంశధార నదిపై నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నేరడి బ్యారేజ్‌కు అడ్డంకులు తొలగడంతో త్వరితగతిన టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, హోటల్స్, షాపింగ్ ఏరియా ఉండాలని సీఎం అన్నారు. ప్రాజెక్టు సమీప ప్రాంతాల సుందరీకరణకు సంబంధించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. పోలవరం-పాపికొండలు-భద్రాచలం వరకు బోటింగ్ సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వాటర్, రాక్, ఫారెస్ట్, స్పోర్ట్స్ థీమ్‌తో పర్యాటకులను ఆకట్టుకోవాలని సూచించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించేలా పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాజెక్టులో భాగమైన ఈసీఆరఎఫ్ డ్యామ్ గ్యాప్ 1, 2 పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. ట్విన్ టన్నెల్స్ లైనింగ్ పనులు 77 శాతం, అప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 98 శాతం, హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 71 శాతం, ఇరిగేషన్ టన్నెల్ తవ్వకాలు పూర్తయ్యాయని, లైనింగ్ 76 శాతం పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. కేఎల్ బండ్ ఎర్త్ వర్క్, ఎంబార్క్‌మెంట్ రెండూ 89 శాతం మేర పూర్తయిందని, ఏడాది జూన్ కల్లా అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. ఆరఅండఆర్‌కి సంబంధించి 95 కాలనీలకు గాను 26 పూర్తయ్యాయని, మిగిలిన వాటిలో 49 కాలనీలు ఈ ఏడాది సెప్టెంబరు నాటికి, మరో 20 కాలనీలు 2027 ఏప్రిల్ నాటికి పూర్తి కానున్నాయని వివరించారు. తొలి దశలో 38,060 నిర్వాసిత కుటుంబాలకు గాను, ఇప్పటివరకు 16,763 కుటుంబాలను తరలించినట్టు అధికారులు వివరించారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి 8,518 కుటుంబాలు, 2027 మార్చి నాటికి 12,779 కుటుంబాల తరలింపు పూర్తి కావాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.27,089 కోట్లు వ్యయం కాగా, మరో రూ.5,108 కోట్లతో సివిల్, ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి కానున్నాయి. వెలిగొండ స్టేజ్ 1 కు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 74 శాతం, టన్నెల్ 2 బెంచింగ్ 94 శాతం, లైనింగ్ 66 శాతం, ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ కాంక్రీట్ 84 శాతం, లైనింగ్ 8 శాతం పూర్తయ్యాయని తెలిపారు. తీగ లేరు కెనాల్ హెడ్ రెగ్యులేటర్ గేట్లు, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, డైవర్షన్ రోడ్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మొత్తం వెలిగొండ పనులు జూన్ చివరి కల్లా పూర్తి చేయాలని లక్ష్యం కాగా, దీనికి రూ.2,042 కోట్లు వ్యయం కానుంది. మల్యాల ఎత్తిపోతల ద్వారా 52 టీఎంసీల శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను ఇప్పటివరకు రాయలసీమకు తరలించినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. హంద్రీ నీవా ఫేజ్ 1 కెనాల్ విస్తరణ పనులు 92 శాతం పూర్తికాగా, ఫేజ్ 2 లింకింగ్ కుప్పం, పుంగనూరు కెనాల్స్ 85 శాతం పూర్తయ్యాయి. 618 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు గాను 432 ట్యాంకులను పూర్తిగా నింపగా, 98 ట్యాంకులు పాక్షికంగా నింపినట్టు వివరించారు. 200 టీఎంసీల గోదావరి వరద నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల సాగర్‌కు తరలించేందుకు రూ.58,700 కోట్లు ఖర్చు కానుందని, దీనికి సంబంధించి సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్‌కు అక్టోబరు 31 కల్లా ఆమోదం లభిస్తుందన్నారు. అటవీ, పర్యావరణ అనుమతులు ఆర్ అండ్ ఆర్ క్లియరెన్స్ సెప్టెంబరు 30 కి పూర్తి కానున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. సీఎం ఆదేశాల మేరకు చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని, ఏప్రిల్ 1 నాటికి భూగర్భ జలాలు 625 టీఎంసీల అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1,002 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు గాను గత ప్రభుత్వంలో నిర్వహణ లేని కారణంగా 244 పథకాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, మిగిలిన 758 ఎత్తిపోతల పథకాలను థర్డ్ పార్టీ ద్వారా 5 ఏళ్ల పాటు నిర్వహించడానికి రూ.1637.66 కోట్లు ఖర్చు కానుందని అధికారులు సీఎంకు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


