Homeఆంధ్రప్రదేశ్స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్య‌క్రమ బాధ్య‌త అంద‌రిదీ

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్య‌క్రమ బాధ్య‌త అంద‌రిదీ

- Advertisement -


విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటీ ;  స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర విజయవంతంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్, కమిషనర్(ఎఫ్.ఎ.సి.) పి.ప్రశాంతి అన్నారు. కంబాల చెరువు పార్కు వద్ద నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర (ఎస్ఎఎస్ఎ) కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి శనివారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, స్థానికులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. తొలుత డ్రోన్‌ సాయంతో చెరువులో దోమల మందును పిచికారీ చేశారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్సీ చేతులమీదుగా చెరువులో దోమల నివారణకు గంబూషియా చేపలను విడిచిపెట్టారు. దోమలు వృద్ధి కేంద్రాలను ఎప్పటికప్పుడు గుర్తించి.. లార్వా దశలోనే నియంత్రించడంపై దృష్టిసారించాలని ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ సిబ్బందికి కలెక్టర్ సూచించారు. కాలువలు, కుంటల్లో ఆయిల్‌ బాల్స్‌ వేసి., రసాయనాలు పిచికారి చేయాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా హ్యాండ్ స్ప్రేయింగ్ యంత్రాలను పెంచుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛత కార్యక్రమాల విజయవంతంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వ పరంగా చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతులను చేసి వాటిని విజయవంతం చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమన్నారు. అలాగే ప్ర‌జ‌ల్లో ఈ-వ్య‌ర్ధాలపై (ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు) అవ‌గాహ‌న కల్పించాలన్న ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం స్వ‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మం చేపట్టిందని, తద్వారా ఈ-వ్యర్థాలను సేక‌రించి శాస్త్రీయ ప‌ద్ధ‌తుల్లో తొల‌గించేందుకు ప్రాధాన్య‌త ఇస్తోంద‌న్నారు. ప్రజలు తమ ఇళ్ల‌లో పాడైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా లేదా విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో పారవేయడం వల్ల వాయుకాలుష్యం పెరుగుతుందని కలెక్టర్ అన్నారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. .అలాగే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్స్‌ నిషేధాన్ని నగరంలో సమర్థవంతంగా అమలు చేసి పర్యావరణాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.   ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ఒక బృహత్తరమైన కార్యక్రమం అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించేందుకు ప్రతీ పౌరుడు సామాజిక బాధ్యతగా మొక్కలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మానవాళి మనుగడ పచ్చదనం పరిఢవిల్లితేనే సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలన్నారు. అలాగే ప్లాస్టిక్‌ వాడకం పెనుభూతం లాంటిదని, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ వాడకం నిషేధాన్ని గట్టిగా అమలు చేయకుంటే మన భావితరాలకు పెనుముప్పు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్. వెంకట రమణ, సెక్రటరీ జి.శైలజావల్లి, ఎస్ఈ(ఇంజనీరింగ్) ఎం.సీహెచ్ కోటేశ్వరరావు, సిటీ ప్లానర్ జి.కోటయ్య, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, ఈఈలు మాధవి, రీటా, మదర్సా అలీ, సీఎంఎం రామలక్ష్మి, అకౌంటెంట్ నాగమణి, ఇతర మున్సిపల్ అధికారులు, పబ్లిక్ హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.    

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు