కుంచాల కైవల్య రెడ్డికి మంత్రి కందుల దుర్గేష్ అభినందన
విశాలాంధ్ర – నిడదవోలు : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యా రెడ్డి నాసా ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం(ఐఏఎస్పీ)కి ఎంపిక కావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఘనత సాధించిన సందర్భంగా కుంచాల కైవల్యరెడ్డి తల్లిదండ్రులు వచ్చి శనివారం మంత్రి కందుల దుర్గేష్ ను నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో కలిశారు.కైవల్య సాధించిన విజయాలను, వచ్చిన అవార్డులను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా తాను సాధించిన రికార్డులను కైవల్య మంత్రి దుర్గేష్ కు వివరించగా చిన్న వయస్సులోనే ప్రతిభ చాటుకొని పదుల సంఖ్యలో రికార్డులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో ఏపీ తరపున చిన్నప్రాయంలోనే గుర్తింపు తెచ్చుకున్న చిన్నారిని అభినందిస్తూనే వ్యోమగామి కావాలన్న చిన్నారి కల నెరవేరాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. అంతరిక్ష రంగంలో ఆసక్తితో రెండు గ్రహశకలాలను కనుగొనడం , ఇస్రో వారు నిర్వహించిన పలు పోటీలలో బహుమతులు అందుకోవడం , బహుముఖ ప్రజ్ఞతో మూడు ప్రపంచ రికార్డులతోబాటు పలు అవార్డులు సొంతం చేసుకున్న కైవల్య ను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్ లో ఖగోళ శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి సేవలందించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పోగ్రామ్‌కు ఎంపికైన 15 – 25 ఏళ్ల మధ్య వయసున్న 60 మంది విద్యార్థుల్లో కైవల్య ఒకరని, గతంలోనే 118 మూలకాలున్న ఆవర్తన పట్టిక(పీరియాడికల్ టేబుల్)ను బ్లాక్స్ లో 38 సెకన్లలో అమర్చి ఇంటర్నేషనల్ వండర్ ఆఫ్ బుక్ రికార్డ్స్ సాధించిన కైవల్యను ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. వారి వెంట సమిశ్రగుడెం సొసైటీ అధ్యక్షులు ఉప్పులూరు రామ్మోహన్, ఇమ్ము పాల్గొన్నారు


