
– ది జాంపేట కో – ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ బొమ్మన జయ కుమార్
విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; 1926వ సంవత్సరం ఆగస్టు 22వ తేదీన రాజమహేంద్రవరం లోని జాంపేటలో స్థానిక దేవాంగ ప్రముఖులతో పాటు వస్త్ర వ్యాపారి కీ.శే. శీలా వీరభద్రుడు ఆధ్వర్యంలో ఒక చిన్న సహకార సంస్థగా తన ప్రస్థానం ప్రారంభించిన ది జాంపేట కో – ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నేడు 99 వసంతాలు పూర్తి చేసుకుని శత వసంతంలోకి అడుగుపెట్టిందని బ్యాంకు చైర్మన్ బొమ్మన జయ కుమార్ అన్నారు. తమ బ్యాంకు శత వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా స్థానిక జాంపేటలోని బ్యాంకు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చేనేత కార్మికులు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆలంబనగా ప్రారంభించిన తమ బ్యాంకు నేడు అనేక శాఖలను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. 2001 వ సంవత్సరంలో కీ.శే. బొమ్మన రాజ్ కుమార్ పాలకవర్గ సారథ్య బాధ్యతలు తీసుకునే సమయానికి బ్యాంకు డిపాజిట్లు సుమారు రూ. 1.4 కోట్లు , లోన్లు రూ.9 కోట్లు మాత్రమే ఉన్నాయని, ఆనాటి నుంచి ఖాతాదారుల విశ్వాసం పొంది 2006లో ఆర్ బిఐ వారి లైసెన్సు పొందడం జరిగిందన్నారు. ఈ క్రమంలో 2009 నుండి 2018 వరకు 8 కొత్త బ్రాంచీలను ప్రారంభించామని, అన్ని బ్రాంచీలను సిబిఎస్ తో అనుసంధానించి ‘ఎనీ బ్రాంచ్ బ్యాంకింగ్, ఆర్టిజిఎస్/ నెఫ్ట్, ఐఎంపిఎస్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించామని, అన్ని బ్రాంచీలలో స్వంత ఎటిఎం లను కూడా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా రూపే డెబిట్ కార్డులు జారీ లాంటి ఆధునిక టెక్నాలజీతో కూడిన సేవలను ఖాతాదారులకు అందించి జాంపేట బ్యాంకు వ్యాపార స్థాయిని అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్ళిన ఘనత కీ.శే.బొమ్మన రాజ్ కుమార్ సారధ్యgలోని పాలకవర్గానికి చెందుతుందన్నారు. అనంతరం తన సారధ్యంలో మరో నాలుగు బ్రాంచీలు ప్రారంభించి మొత్తం 13 బ్రాంచీలతో వ్యాపారాన్ని రూ. 793 కోట్ల రూపాయల స్థాయికి చేర్చడం జరిగిందన్నారు. దీనికి తోడు అన్ని ఆధునిక సేవలను అందుబాటులోకి తెచ్చి ఖాతాదారులకు నమ్మకమైన సేవలందించామన్నారు. అలాగే, ఏటా లాభాలను ఆర్జిస్తూ, బ్యాంకులోని 35,000 మంది సభ్యులకు క్రమం తప్పకుండా డివిడెండు చెల్లింపులు చేయడమే కాకుండా బ్యాంకు సభ్యులందరికీ రూ.లక్ష రూపాయల ప్రమాద బీమా సదుపాయం అందిస్తున్నామన్నారు. బ్యాంకు లోని 13 బ్రాంచీలలో స్వంత ఎటిఎం లను ఏర్పాటు చేసి ప్రతి నెల ఎటిఎంల ద్వారా సుమారు 2 నుండి 3 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నామన్నారు. డిపాజిట్ల పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందించి, గోల్డ్ లోన్లు, హౌసింగ్ లోన్లతో పాటు తనఖా లోన్లు పై మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ రేట్లు సవరించి వ్యాపారాభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే శత వసంతాల వేడుకల ప్రారంభం సందర్భం గా డిపాజిట్ దారులకు ప్రతి లక్ష రూపాయల డిపాజిట్ కు రూ.10,000 చొప్పున షేరు ధనం మంజూరు చేయడానికి పాలకవర్గం తీర్మానించిందని, ఇలా మంజూరు చేసే షేరు ధనం ఒక్కొక్కరికీ రూ. 1,50,000 మించ కూడదని నిర్ణయించామన్నారు. ఆగస్టు ల 2026 నాటికి 900 కోట్ల రూపాయల వ్యాపారం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. వైస్ చైర్మన్ రొబ్బి విజయ్ శేఖర్ మాట్లాడుతూ, శత వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ప్రతీ నెలా ఒక్కో బ్రాంచీలో శత వేడుకలు నిర్వహిస్తున్నామని, వచ్చే సంవత్సరం శత వసంతాల వేడుకలను భారీ స్థాయిలో నిర్వహిస్తామన్నారు. ఖాతాదారుల విశ్వాసం, సిబ్బంది చిత్తశుద్ధి, పాలక వర్గ సభ్యుల నిరంతర కృషి బ్యాంకును ఉన్నత స్థితికి తీసుకెళ్ళాయన్నారు. ఈ కార్యక్రమంలో జామిశెట్ఠి గాంధీ, ప్రసాదుల హరనాధ్, మహంతి లక్ష్మణరావు, శ్రీమతి ద్వార పార్వతి సుందరి, బూర రామచంద్రరావు, బీర శ్రీనివాసరావు, జి.ఎస్. ప్రసాదరావు, కె.నాగేశ్వరరావు, వై. రామకృష్ణ, జామి కృష్ణ, పి. వెంకటేశ్వరరావు, ఎం. విజయప్రతాప్ , వెంకట్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.


