Home‘క్వాంటం’తో ప్రయోజనాలెన్నో!

‘క్వాంటం’తో ప్రయోజనాలెన్నో!

- Advertisement -

. దేశంలోనే అమరావతి కేంద్రంగా ఏర్పాటు
. డేటా సెంటర్ల ఏర్పాటుకు ఏపీ అనుకూలం
. పెట్టుబడిదారులకు అనుకూలంగా పారిశ్రామిక పాలసీలు
. సింగపూర్‌ పారిశ్రామికవేత్తల సదస్సులో చంద్రబాబు పిలుపు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని, 2026 జనవరి నాటికి ప్రారంభమయ్యే ఈ ఎకో సిస్టంతో అనేక ప్రయోజనాలున్నందున పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పారి శ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ప్రయోజనాలను సింగపూర్‌ కంపెనీలు పొందటంతో పాటు పరిశోధనలకూ ఆస్కారం ఉందని, అలాగే రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. సింగపూర్‌లో మూడోరోజు పర్యటిస్తున్న సీఎం… ఆ దేశ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కాన్ఫరెన్స్‌కు సింగపూర్‌లోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలు తెలియచేశారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే గూగుల్‌ డేటా సెంటర్‌ విశాఖలో ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి సింగపూర్‌ పారిశ్రామికవేత్తలకు తెలియచేశారు. టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ సహా వివిధ ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలంగా 20కి పైగా పాలసీలు అమలు చేస్తున్నామని సీఎం వెల్లడిరచారు. పారిశ్రామిక అనుకూల విధానాలతో పాటు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రౌండ్‌ టేబుల్‌ వేదికగా ముఖ్యమంత్రి సింగపూర్‌ పారిశ్రామిక వేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులకు వివరించారు.
కెప్పెల్‌, జీఐసీ, విల్మర్‌ ప్రతినిధులతో భేటీ
నగరాభివృద్ధి, వాణిజ్య సదుపాయాలు, మౌలిక వసతుల రంగాల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సింగపూర్‌కు చెందిన కెప్పెల్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ లిమ్‌ యాంగ్‌ వియ్‌తో ముఖ్యమంత్రి విడిగా సమావేశమయ్యారు. అమరావతి నగర అభివృద్ధిలో కెప్పెల్‌ భాగస్వామ్యంపై ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రాభివృద్ధి కోసం విశాఖను గ్రోత్‌ ఇంజిన్‌గా మార్చే లక్ష్యంతో ఐటీ, వాణిజ్యం, గృహ నిర్మాణ రంగాల్లో ప్రాజెక్టుల అభివృద్ధికి కెప్పెల్‌ను ఆహ్వానించారు. అమరావతి నగర అభివృద్ధి, రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌, పరిశ్రమల రంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై గవర్నమెంట్‌ ఆఫ్‌ సింగపూర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ (జీఐసీ) చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ బ్రాన్‌ యోతోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. జీఐసీతో దీర్ఘకాలిక భాగస్వామ్యం, స్థిరమైన పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పనపై చర్చించారు. వైద్య, విద్య, పట్టణ ప్రణాళిక, పౌర సదుపాయాలు వంటి రంగాల్లో జీఐసీ పెట్టుబడులు పెట్టేలా అనువైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై విల్మర్‌ ఆసక్తి
విల్మర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ చైర్మన్‌, సీఈవో క్వాక్‌ కూన్‌ హాంగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం… ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎడిబుల్‌ ఆయిల్స్‌, అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. రైతులకు విలువ ఆధారిత మార్కెట్‌ కల్పించేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో సహకరించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించగా… విల్మర్‌ టెక్నాలజీ ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్సుకు మంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్‌, పి.నారాయణ, ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు