టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం: ఇళ్లు లేని నిరుపేదలకు ఇచ్చిన స్థలాలతో కొందరు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన ధర్మవరంలోని పలు కాలనీల్లో పర్యటించారు. ధర్మవరం పట్టణంలోని 21, 22వ వార్డుల్లో ఆయన పర్యటించారు. ఎల్పీ సర్కిల్ లోని అన్న క్యాంటీన్ వద్ద నుంచి సిద్దయ్యగుట్ట, సాయి నగర్ లలో ఇంటింటికి వెళుతూ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. చాలా చోట్ల ప్రజలు ప్రభుత్వ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో కొన్ని సమస్యలు కూడా శ్రీరామ్ దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజీలు, రోడ్లు, ఇళ్ల స్థలాల గురించి ఆయనకు విజ్ఞప్తులు చేశారు. స్థానికంగా ఉన్న సచివాలయం సిబ్బందిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ప్రజల సమస్యలు పరిష్కారం చేసే విధంగా శ్రీరామ్ చొరవ చూపారు. కొన్ని సమస్యలకు ఎక్కడికక్కడే పరిష్కారం చూపారు మరికొన్నింటిని నిర్దేశిత సమయంలోపు పరిష్కరించే విధంగా చూడాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లో చాలామంది అనర్హులకు దక్కాయని కొందరు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పేదల ఇంటి స్థలాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. దీనిపై శ్రీరామ్ మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన స్థలాలతో ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం సరైంది కాదన్నారు. గత ప్రభుత్వంలో చాలామంది అనర్హులు ఇళ్ల పట్టాలు తీసుకున్నారని.. అలాగే పేదలకు ఎక్కడ స్థలం ఇచ్చారో చెప్పకపోవడం వల్ల వారు ఇళ్లు నిర్మించుకోలేకపోయారన్నారు. ప్రస్తుతం ఆ స్థలాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. దీనిని వెంటనే అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించే ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. తాము ఏడాది పాలన గురించి ప్రజలకు వివరించడమే కాకుండా.. వారిని నేరుగా కలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా వచ్చిందని అన్నారు. ప్రజలు చెప్పిన సమస్యలు కూడా పరిష్కరించేలా చూస్తున్నామని శ్రీరామ్ స్పష్టం చేశారు.
ప్రజలకిచ్చిన ఇంటి స్థలాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు
- Advertisement -
RELATED ARTICLES


