– కారణాలను సరైన సమయంలో వెల్లడిస్తా : పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ బోస్
కోల్‌కతా: అంతా ఆలోచించే తాను గవర్నర్ పదవికి రాజీనామా చేశానని పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ సీవీ ఆనంద్ బాస్ చెప్పారు. పదవికి రాజీనామా చేయడానికి కారణాలను తగిన సమయంలో బయటపెడతానని, అంతవరకు అది రహస్యమేనని ఆనందబోస్ చెప్పారు. దిల్లీ నుంచి ఆదివారం కోల్‌కతాకు తిరిగివచ్చిన ఆయన.. విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే బెంగాల్‌లో తాను 12 సెంచరీలు చేసినట్లేనని, 1,200 రోజులకు పైగా ఆ పదవిలో కొనసాగానని తెలిపారు. ఆట ఎప్పుడు ముగియాలనేది కూడా నియమాల్లో ఉంటుందని నర్మగర్భంగా చెప్పారు. దిల్లీకి బయల్దేరడానికి ముందే తాను రాజీనామా చేశానని వెల్లడించారు. తన రాజీనామాపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల గురించి స్పందించడం ప్రస్తుత పరిస్థితుల్లో సబబుకాదన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు బెంగాల్‌కు వస్తానన్నారు. ‘‘ప్రవేశం ఉన్నచోట నిష్క్రమణ కూడా ఉంటుంది. ఇంతకాలం సేవలందించడం చాలు. నిష్క్రమణకు ఇదే సరైన తరుణమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నా. ఎప్పుడు పదవిని వదిలేయాలో నిర్ణయించుకునేందుకు నాకు తగినంత సమయం ఇచ్చారు. ఏదో ఒకనాడు పదవిని వీడాల్సి వస్తుందని పదవీబాధ్యతలు తీసుకున్నరోజే నాకు తెలుసు. నేనేమీ ఆకస్మికంగా వెళ్లిపోలేదని స్పష్టంచేశారు.


