మహిళలకు 40 గ్రాముల వరకు. .. పురుషులకు 20 గ్రాముల వరకు
విదేశాల నుంచి పసిడి ఆభరణాలు తెచ్చుకునేందుకు గరిష్ఠ పరిమితి ఇది
విదేశాల నుంచి మనదేశానికి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చని పేర్కొంది. అయితే వీరు ఏడాదికి పైగా విదేశాల్లో నివసిస్తూ, తిరిగి వస్తున్న వారు లేదా భారత సంతతి పర్యాటకులైనా కావచ్చు. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ఆభరణాలు కచ్చితంగా వ్యక్తిగత వినియోగం కోసమే తీసుకురావాలి. బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉండే పసిడికి ఈ మినహాయింపు లభించదు. ఇప్పటివరకు మహిళలు రూ.లక్ష, పురుషులు రూ.50 వేల విలువైన ఆభరణాలే ఇలా తీసుకురావచ్చు.
.
2016 నాటి పాత నిబంధనల స్థానంలో, రూపొందించిన ‘బ్యాగేజీ నిబంధనలు 2026’ ఈనెల 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) సోమవారం పేర్కొంది..దీని ప్రకారం.విదేశాల నుంచి తిరిగి వచ్చే భారతీయ నివాసితులు, విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి పర్యాటకులు లేదా పర్యాటక వీసా కాకుండా ఇతర వీసాలపై వచ్చే విదేశీయులు, తమ వెంట తీసుకొచ్చే రూ.75,000 విలువైన వస్తువులపై కస్టమ్స్ సుంకం (డ్యూటీ) మినహాయింపు ఉంటుంది. గతంలో ఈ పరిమితి రూ.50,000 మాత్రమే ఉండేది. ఇకపై వీరు వ్యక్తిగత వినియోగం కోసం రూ.75,000 విలువైన వస్తువులను కస్టమ్స్ సుంకం చెల్లించకుండానే ఇక్కడకు తెచ్చుకోవచ్చు. రెండేళ్ల లోపు వయసున్న పిల్లలకు ఈ మినహాయింపు వర్తించదు.విమానం లేదా నౌకలపై వచ్చే విదేశీ పర్యాటకులు రూ.25,000 విలువైన కొత్త వస్తువులనే సుంకం లేకుండా తీసుకురావచ్చు. భూమార్గం (రోడ్డు లేదా రైలు) ద్వారా వచ్చే ప్రయాణికులకు వారి వ్యక్తిగత అవసరాలకు వాడే పాత వస్తువులపైనే మినహాయింపు ఉంటుంది.
18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న ప్రయాణికులు అదనంగా ఒక కొత్త ల్యాప్టాప్ లేదా నోట్ప్యాడ్ను సుంకం లేకుండా తమ లగేజీలో తెచ్చుకోవచ్చు. ప్రయాణంలో వ్యక్తిగత అవసరాల కోసం తెచ్చుకునే పాత వస్తువులపై (దుస్తులు, ఇతర పరికరాలు) ఎలాంటి సుంకం ఉండదు.
ఉద్యోగ రీత్యా లేదా ఇతర కారణాల వల్ల విదేశాల్లో ఉండి, ఇప్పుడు శాశ్వతంగా భారత్కు తిరిగి వచ్చే వారికి, నివాస కాలం ఆధారంగా గృహోపకరణాలపై ప్రత్యేక మినహాయింపులు లభిస్తాయి.విదేశాల్లో 3-12 నెలలు నివాసం ఉన్న వారికి రూ.1,50,000 విలువైన గృహోపకరణాలు గత రెండేళ్లలో ఏడాదిపాటు విదేశాల్లో ఉన్న వారు రూ.3 లక్షల విలువైన వస్తువులను తెచ్చుకోవచ్చు.కనీసం రెండేళ్లు విదేశాల్లో ఉండి, తిరిగి వచ్చేవారు గరిష్ఠంగా రూ.7.50 లక్షల విలువైన వస్తువులను సుంకం లేకుండా తీసుకురావొచు్చ. .
సుంకం మినహాయింపు పరిమితి పూర్తిగా వ్యక్తిగతం
సుంకం మినహాయింపు పరిమితి పూర్తిగా వ్యక్తిగతం. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఉంటే, వారికి విడివిడిగానే ఈ పరిమితులు వర్తిస్తాయి. ఒక ప్రయాణికుడికి ఉన్న పరిమితిని మరొకరితో పంచుకునేందుకు, కలపడానికి కుదరదు. 2 లీటర్ల మద్యం, 100 సిగరెట్లు, 125 గ్రాముల పొగాకు ఉత్పత్తుల వరకు సుంకం వర్తించదు. తుపాకులు, ఆభరణాలు కాని బంగారం లేదా వెండి, టీవీ వంటి వస్తువులకు సాధారణ సుంకం మినహాయింపు వర్తించదు.విదేశీ కరెన్సీని దేశంలోకి తేవడం, బయటకు తీసుకెళ్లడం ‘ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్- 2015’ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని సీబీఐసీ ఈ మేరకు పేర్కొంది.


