Homeఅంతర్జాతీయంహిందూ మహాసముద్రంలో 'నిశ్శబ్ద మృత్యువు'..

హిందూ మహాసముద్రంలో ‘నిశ్శబ్ద మృత్యువు’..

- Advertisement -

ఇరాన్‌ యుద్ధ నౌకను ముంచిన టోర్పిడో ఇదే….!

కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న ఇరాన్‌ యుద్ధ నౌకను ముంచేసి అమెరికా సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. చడీచప్పుడు లేకుండా హిందూ మహాసముద్రంలో నీటి దిగువ నుంచి జలాంతర్గామితో అగ్రరాజ్యం ఈ దాడి చేపట్టింది.సబ్‌మెరైన్‌ సహాయంతో శత్రు నౌకను ధ్వంసం చేయడం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అరుదుగా జరిగే సంఘటనగా భావిస్తున్నారు.ఈ ఆపరేషన్‌లో అమెరికా ఉపయోగించినది అత్యంత శక్తివంతమైన సముద్రగర్భ ఆయుధం ‘మార్క్‌ 48 టోర్పిడో (US Mark 48 Torpedo)’. ఈ సముద్రగర్భ క్షిపణి వ్యవస్థ ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? అనే అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.

50 ఏళ్ల క్రితమే సేవల్లోకి..
‘మార్క్‌ 48’ అనేది భారీ బరువు కలిగిన వైర్‌-గైడెడ్‌ టోర్పిడో. దీన్నిఅమెరికా నౌకాదళం 1972లో తొలిసారి తమ యుద్ధ వ్యవస్థల్లో ప్రవేశపెట్టింది.అప్పటి నుంచి కాలానికి అనుగుణంగా ఇందులో పలు అప్‌గ్రేడ్‌లు చేస్తున్నారు.ఆధునిక యుద్ధ అవసరాలకు సరిపోయేలా ఎలక్ట్రానిక్స్‌, గైడెన్స్‌ సిస్టమ్స్‌, ప్రొపల్షన్‌ టెక్నాలజీ వంటి అంశాలను నిరంతరం మెరుగుపరుస్తున్నారు.ఈ టోర్పిడో పొడవు సుమారు 19 అడుగులు కాగా వ్యాసం 21 అంగుళాలు.దీని బరువు దాదాపు 3,800 పౌండ్లు (సుమారు 1,700 కిలోలు). ఇందులో 650 పౌండ్ల వరకు వార్‌హెడ్‌ను అమర్చవచ్చు.గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది కచ్చితంగా దాడి చేయగలదు.

టార్గెట్‌ తప్పినా మళ్లీ వేట..
ఆధునిక నౌకాదళ యుద్ధాల్లో అత్యంత శక్తివంతమైన సముద్రగర్భ ఆయుధాలలో ఒకటిగా మార్క్‌-48ను పరిగణిస్తారు.శత్రు నౌకలకు ఇది “నిశ్శబ్ద మృత్యువు” అని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ కూడా పేర్కొన్నారు.మార్క్‌-48 టోర్పిడోలో అమర్చిన సోనార్‌ గైడెన్స్‌ వ్యవస్థ నీటి అడుగున ఉన్న లక్ష్యాలను గుర్తించి వర్గీకరించి ట్రాక్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.టోర్పిడోను ప్రయోగించిన తర్వాత కూడా సబ్‌మెరైన్‌లో ఉన్న ఆపరేటర్లు దాని మార్గాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది.వైర్‌ కనెక్షన్‌ ద్వారా టార్గెట్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని పంపుతూ దిశను సరిచేయవచ్చు.

ఒకవేళ ఆ గైడెన్స్‌ వైర్‌ తెగిపోయినా టోర్పిడో పూర్తిగా స్వయంచాలక మోడ్‌లో పనిచేయగలదు.
అది స్వతంత్రంగా లక్ష్యాన్ని గుర్తించి దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.అంతేకాదు, ఒకసారి దాడి విఫలమైతే మళ్లీ తిరిగి టార్గెట్‌ను వెంబడించి మరోసారి దాడి చేసే సామర్థ్యమూ దీనికి ఉందని అమెరికా రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా యాంటీ-షిప్‌ క్షిపణులు సముద్ర ఉపరితలం నుంచి నౌకలను లక్ష్యంగా చేసుకుంటాయి.అయితే మార్క్‌-48 టోర్పిడో మాత్రం నౌక కింది భాగం వరకు వెళ్లి అక్కడ పేలుతుంది.అలా పేలినప్పుడు భారీ గ్యాస్‌ బుడగ ఏర్పడి వేగంగా విస్తరిస్తుంది. దాంతో నౌక నిర్మాణం విరిగిపోయి త్వరగా మునిగే ప్రమాదం ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో నౌక పూర్తిగా ధ్వంసం కాకపోయినా దాని కీలక వ్యవస్థలు.. ప్రొపల్షన్‌ యంత్రాంగం వంటి భాగాలు.. పాడైపోతాయి.దీంతో నౌక పని చేయకుండా నీటిలో మునిగిపోతుంది. ఇరాన్‌కు చెందిన యుద్ధ నౌక ఐరిస్‌ దేనా (IRIS Dena) ఘటనలో కూడా మార్క్‌-48 టోర్పిడో అత్యంత కచ్చితత్వంతో పనిచేసిందని నౌకాదళ నిపుణులు పేర్కొంటున్నారు.ఆ సమయంలో ఆ ప్రాంతంలో సబ్‌మెరైన్‌ ఉన్న విషయాన్ని కూడా ఆ యుద్ధ నౌక గుర్తించలేకపోయి ఉండొచ్చని వారు భావిస్తున్నారు.

భారీ ఖర్చుతో తయారీ..
మార్క్‌-48 టోర్పిడో ఒక్కో యూనిట్‌ తయారికి సుమారు 4.2 మిలియన్‌ డాలర్లు ఖర్చవుతాయి.
అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.38 కోట్లకు సమానం.పెద్దఎత్తున ఆయుధాలను తరలించే నౌకలను లక్ష్యంగా చేసుకునేలా దీన్ని అభివృద్ధి చేశారు.ఇటీవల దాడికి గురైన ఇరాన్‌ యుద్ధ నౌకలో కూడా భారీ స్థాయిలో ఆయుధాలు ఉన్నాయి.అందులో భూమి నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, నౌకా రక్షణ క్షిపణులు, టోర్పిడోలు, అలాగే హెలికాప్టర్‌ కూడా ఉన్నట్లు సమాచారం.ఘటన సమయంలో ఆ నౌకలో సుమారు 180 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు 87 మృతదేహాలను వెలికితీశారు.
మరో 32 మందిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించగా, మిగతావారి గురించి ఇంకా సమాచారం అందలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు