హర్మూజ్ ప్రాంతానికి యుద్ధ నౌకలను పంపలేం
యుద్ధంతో నాటోకు సంబంధం లేదన్న జర్మనీ
పర్షియన్ గల్ఫ్‌లో రవాణాపై ఇరాన్ పట్టు
తెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రమవుతోంది. పర్షియన్ గల్ఫ్‌లో చమురు నౌకల రవాణాపై ఇరాన్ పట్టు సాధించడంతో ఇంధన సంక్షోభం, తద్వారా ఆర్థిక సంక్షోభం భయాలు చుట్టుముడుతున్నాయి. చమురుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బలప్రయోగం ద్వారా హర్మొజ్ జల సంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అక్కడికి యుద్ధ నౌకలను పంపేందుకు మిత్ర దేశాలతోపాటు చైనా ససేమిరా అన్నాయి. ఆ యుద్ధంతో నాటోకు సంబంధం లేదని ఐరోపా దేశాలు కూడా తెగేసిచెప్పాయి. మరోవైపు ఇరాన్, లెబనాన్‌లపై ఇజ్రాయెల్, అమెరికా దాడులను కొనసాగించాయి. ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తెరిచిన కొద్ది గంటల్లోనే మూసివేయాల్సి వచ్చింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై, ఇంధన మౌలిక వసతులపై ఇరాన్ దాడులను కొనసాగించింది. పశ్చిమాసియాలో సైనిక చర్యను వెంటనే నిలిపేయాలని అమెరికా, ఇజ్రాయెల్‌ను చైనా కోరింది. హర్మూజ్‌ను తెరిపించడానికి చైనా సహా పలు దేశాలు యుద్ధ నౌకలను పంపాలని ట్రంప్ కోరిన నేపథ్యంలో ఆ దేశం స్పందించింది. అన్నివైపుల నుంచీ దాడులను వెంటనే ఆపాలని చైనా సూచించింది.
యుద్ధ నౌకలను పంపడానికి నిరాకరించిన బ్రిటన్ జపాన్, జర్మనీ…
బ్రిటన్‌కు కూడా హర్మొజ్‌కు యుద్ధ నౌకలను పంపే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోంది. జపాన్ ప్రధాని సనాయీ తకాయిచి పార్లమెంటు వేదికగా… పశ్చిమాసియా సముద్ర జలాల మీదుగా రాకపోకలు సాగించే ఆయిల్ ట్యాంకర్లు, నౌకలకు భద్రత కల్పించేందుకు నౌకాదళాన్ని పంపే ఆలోచనేదీ లేదని ఆమె వెల్లడించారు. హర్మూజ్ జల సంధిపై తాము అమెరికాతో ఎటువంటి ద్వైపాక్షిక చర్చలు జరపలేదని భారత్ స్పష్టం చేసింది. ఇది నాటో యుద్ధం కాదని జర్మనీ ఛాన్సలర్ అధికార ప్రతినిధి స్టెఫాన్ కొర్నెలియస్ తెలిపారు. యుద్ధం ప్రారంభానికి ముందు అమెరికా తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలికే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టంచేశారు. తమ దేశం కాల్పుల విరమణనుగానీ, చర్చలనుగానీ కోరుకోవడం లేదని సోమవారం ఎక్స్‌లో పేర్కొన్నారు.
ట్రంప్‌నకు షాకిచ్చిన మిత్ర దేశాలు
- Advertisement -
RELATED ARTICLES


