ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు 3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలి
.. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. యుగంధర్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యుగంధర్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో,ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేయడం, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడంలో రాష్ట్రము లోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన లక్షలాది మంది యువతకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో కూటమి నేత ప్రస్తుత మంత్రి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో చెప్పిన రెండు లక్షల పైచిలుకు ప్రభుత్వ శాఖలలో ఖాళీలను మీరు అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగ యువత కంటి తుడుపు చర్యగా కేవలం 10 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం కూటమి ప్రభుత్వ వెన్నుపోటు చర్యగా అభివర్ణించారు. అదేవిధంగా మీరు చెప్పిన రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాలు మీరు అధికారంలోకి వచ్చిన తరువాత పదవి విరమణ పొందిన వారి ఖాళీలను మీరు ఎవరితో భర్తీ చేసారో, అందుకు సంబందించిన నోటిఫికేషన్ వివరాలు వెల్లడించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖల పోస్టులను భర్తీ చేసే విదంగా రెండు లక్షల 30 వేల పైచిలుకు ఉద్యోగాలతో సమగ్ర మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 19,000 పోస్టులను భర్తీ చేసి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలని, ఇతర అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేసారు.వెంటనే అర్హులైన నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని బకాయిలతో సహా చెల్లించాలని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లో భాగంగా వాలంటీర్లకు కనీసం రూ.10,000 గౌరవ వేతనం ఇచ్చి ,వారిని తిరిగి విధులలోకి తీసుకోవాలి అని తెలిపారు. అదేవిధంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఆర్టీసీ సంస్థను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. పేద నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ సర్కిల్స్, స్టడీ మెటీరియల్ అందించి, పారిశ్రామిక శిక్షణతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి–యువజనులను ఐక్యం చేసి దశలవారీగా ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కమల్ భాష, ధర్మవరం నాయకులు, జగదీర్, వినోద్ రాము, సాయి,ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.


