టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పోలవరం నిర్వాసితులకు రూ.4,311 కోట్లు చెల్లించామని అన్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వం నిర్వాసితులకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి.. పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్ట్ పనులను ఆయన నేడు పరిశీలించారు.. అమరావతి నుంచి నేరుగా పోలవరం చేరుకున్న ఆయన ముందుగా ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఇంచార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు.
అనంతరం పోలవరం నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరు అయ్యారు. ఇక, గత కొన్నేళ్లగా ఎదురైన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకి పోలవరం నిర్వాసితులు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం నిర్వాసితులు వేల ఎకరాల్లో భూములు త్యాగం చేశారని గుర్తు చేశారు. భూములు ఇచ్చినోళ్లను గత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఫైర్ అయ్యారు.
నిర్వాసితులను చూస్తే తనకు బాధేస్తోందని.. వరదలు వచ్చినా గత ప్రభుత్వం ఇటు వైపు కూడా చూసిన దాఖలాలు లేవన్నారు. నిర్వాసితులను ఆదుకున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. 2019లో టీడీపీ ఆధికారంలో కొనసాగి ఉంటే.. 2020లోనే పోలవరం పూర్తయ్యేది తెలిపారు. ఎప్పుడో పూర్తి కావాల్సి ప్రాజెక్టును జగన్ సర్కార్ మరుగును పడేసిందని.. ఇప్పుడు ప్రాజెక్ట్ ఆలస్యమై.. ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు.
ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ పక్కన పెట్టారు. ఈ ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారు. రూ.829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాలో వేసిన ఘనత మా ప్రభుత్వానిది. పోలవరంలో నీళ్లు వదిలే ముందే.. 2027 నవంబర్ నాటికి పునరావాసం పూర్తిచేస్తాం. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటాం. నిర్మాణంలో ఆలస్యం వల్ల హైడల్ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తాం. మన ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది.. సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేసుకుందాం అని చంద్రబాబు అన్నారు.
2014-2019 మధ్య మొత్తం 33 సార్లు ప్రాజెక్ట్‌ను సందర్శించానని అన్నారు. పోలవరం నిధులను గత సర్కార్ యథేచ్ఛగా దారి మళ్లించిందని ఆరోపించారు. 2027 నాటికి పునరావాసం పూర్తి చేస్తామని.. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదుతామని స్పష్టం చేశారు. అదేవిధంగా అధికారులు ప్రతి ఒక్కరికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వేదిక పైనుంచే ఆదేశాలు జారీ చేశారు. తమ ప్రభుత్వం వచ్చిందని.. అందరికీ న్యాయం చేస్తుందని చంద్రబాబు అన్నారు.