ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు ముగియడానికి ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి.దీంతో చాలా మంది చివరి నిమిషంలో రిటర్నులు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే ఈ హడావుడిలో చాలామంది చేసే ప్రధాన పొరపాటు సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంపిక చేయకపోవడమే.వేతన ఉద్యోగి కాబట్టి ఐటీఆర్-1 సరిపోతుందని భావించడం అన్ని సందర్భాల్లో సరైంది కాదు.గత ఆర్థిక సంవత్సరంలో మీరు చేసిన పెట్టుబడులు,మూలధన లాభాలు,విదేశీ ఆదాయం లేదా ఇతర ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఐటీఆర్-2 దాఖలు చేయాల్సిన పరిస్థితులు ఉండొచ్చు.
పొరపాటున తప్పుడు ఫారం సమర్పిస్తే ఆదాయపు పన్ను శాఖ దానినిఃడిఫెక్టివ్ రిటర్న్‌ఃగా పరిగణించే అవకాశం ఉంటుంది.అందుకే ఐటీఆర్-1,ఐటీఆర్-2 మధ్య తేడాను ముందుగానే తెలుసుకోవడం అవసరం.
ఐటీఆర్-1 ఎవరికి?
క్రింది అర్హతలు ఉన్న వ్యక్తులు ఐటీఆర్-1 (సహజ్) ఫారం ద్వారా రిటర్న్ దాఖలు చేయవచ్చు.వేతనం లేదా పెన్షన్ ద్వారా ఆదాయం పొందేవారు.వార్షిక మొత్తం ఆదాయం రూ.50 లక్షలకు మించకూడదు.
గరిష్ఠంగా రెండు సొంత ఇళ్ల నుంచి ఆదాయం ఉన్నవారు.సెక్షన్ 112A ప్రకారం దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.1.25 లక్షల వరకు ఉన్నవారు.వ్యవసాయ ఆదాయం రూ.5 వేలలోపు ఉన్నవారు.పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ, ఆదాయపు పన్ను రీఫండ్‌పై వడ్డీ లేదా ఇతర వడ్డీ ఆదాయాలు మాత్రమే ఉన్నవారు.
ఐటీఆర్-2 ఎవరు దాఖలు చేయాలి?
క్రింది పరిస్థితుల్లో ఐటీఆర్-2 ఫారం ద్వారా రిటర్న్ దాఖలు చేయాలి.వార్షిక ఆదాయం రూ.50 లక్షలలోపు ఉన్నప్పటికీ ప్రత్యేక ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు.స్టార్టప్ కంపెనీల ESOPలపై పన్ను చెల్లింపు వాయిదా పడిన వారు.
ఏదైనా కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న వారు.
రెండు కంటే ఎక్కువ సొంత ఇళ్లను కలిగి ఉన్న వారు.
సెక్షన్ 112A కింద రూ.1.25 లక్షలకు మించిన దీర్ఘకాలిక మూలధన లాభాలు పొందిన వారు.
స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్ల ద్వారా స్వల్పకాలిక మూలధన లాభాలు (STCG) పొందిన వారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లు కలిగి ఉన్న వారు.
ఐటీఆర్-2 ఎవరు దాఖలు చేయాలి?
పన్ను పరిధిలోకి వచ్చే మూలధన నష్టాలను భవిష్యత్ సంవత్సరాలకు బదిలీ చేసుకోవాలనుకునే వారు. విదేశీ ఆదాయం లేదా రూ.5 వేలకుపైగా వ్యవసాయ ఆదాయం పొందిన వారు. కరెంట్ ఖాతాలో రూ.1 కోటి కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేసిన వారు. విదేశీ ప్రయాణాల కోసం రూ.2 లక్షలకు మించి ఖర్చు చేసిన వారు. ఏడాదిలో రూ.1 లక్షకు మించి విద్యుత్ బిల్లులు చెల్లించిన వారు.
తప్పుడు ఐటీఆర్ ఫారం ఎంచుకుంటే ఏమవుతుంది?
తప్పు ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకుని రిటర్న్ సమర్పిస్తే, ఆదాయపు పన్నుశాఖ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(9) ప్రకారం దానిని డిఫెక్టివ్ రిటర్న్‌గా పరిగణిస్తుంది. అనంతరం పన్ను చెల్లింపుదారుకు నోటీసు జారీ చేసి,సాధారణంగా 15రోజుల వ్యవధిలో లోపాలను సరిచేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఆ గడువులోపు తప్పును సరిచేయకపోతే మీ రిటర్న్ ప్రాసెస్ కాదు. దీంతో ఆదాయపు పన్ను రీఫండ్ ఆలస్యమవుతుంది.
అంతేకాకుండా నిర్ణీత సమయంలో లోపాన్ని సవరించకపోతే మీరు అసలు ఐటీఆర్ దాఖలు చేయనట్లుగా పరిగణించే అవకాశం ఉంది. ఫలితంగా వడ్డీ, జరిమానా వంటి అదనపు భారం పడుతుంది. అందువల్ల జులై 31 గడువు ముగిసేలోపు మీ ఆదాయం,పెట్టుబడులు,ఆర్థిక లావాదేవీలకు అనుగుణంగా సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంపిక చేసి రిటర్న్ దాఖలు చేయడం అత్యంత ముఖ్యం. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే ప్రక్రియ పూర్తి చేయడం మంచిది.


