రాజధాని అమరావతి ప్రాంతంలో వైసీపీ సీఆర్డీఏ పరిరక్షణ బృందం పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ వద్ద వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు రాజధాని భూములను పరిశీలించేందుకు వెళుతుండగా కూటమి సానుభూతిపరులు, రాజధాని రైతులు వారిని అడ్డుకున్నారు.ఃగో బ్యాక్ వైసీపీః అంటూ నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ నేతలపై కోడిగుడ్లు కూడా విసిరారు. లేళ్ల అప్పిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు రువ్వడంతో వాహనం దెబ్బతిన్నట్లు సమాచారం. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు జోక్యం చేసుకున్నా ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులపై కూడా రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఉండవల్లి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అమరావతిలో పేర్ని నాని తదితర వైసీపీ నేతలపై కోడిగుడ్లతో దాడి
- Advertisement -


