విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని శివకళాజ్యోతి ప్రాంగణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని మండల కన్వీనర్ ఖాదర్ వలీ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నార్పల సత్యనారాయణ రెడ్డి, చాములూరు రాజగోపాల్ హాజరై వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నార్పల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్సార్ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. రైతుల సంక్షేమం, పేదల అభ్యున్నతి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు వైఎస్సార్ అని పేర్కొన్నారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొని పాలన సాగించిన ప్రజానాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాల ప్రధాతగా నిలిచారని, ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని అన్నారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై “జోహార్ వైఎస్సార్” అంటూ నినాదాలు చేశారు. అలాగే జగన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా నినదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు


