మంగళవారం అప్పలవారం
- ఐదు నెలలు… రూ.53,089 కోట్లు
- తాజాగా మరో రూ.2,600 కోట్లు
- ప్రతి నెలా వడ్డీలకే రూ.3,107 కోట్ల చెల్లింపు
- రాష్ట్ర ఖజానాపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి కొనసాగుతోంది. ఉద్యోగుల జీతాలు, సంక్షేమం, పెన్షన్లు, వడ్డీలు, ఇతర అభివృద్ధి పనులకు కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిర్ఙిక్కిరి చేస్తున్నాయి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ నిర్వహణకే సరిపోతుండగా… ఆశించిన స్థాయిలో రాబడులు లేకపోవడంతో సంక్షేమ పథకాల అమలుకు అప్పలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే రాష్ట్రం రూ.53,089 కోట్ల అప్పులు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు ప్రతి మంగళవారం ఆర్బీఐ వేలంలో ప్రభుత్వం పాల్గొంటూ అప్పులు చేస్తోంది. మంగళవారమంటే అప్పుల వారంగా మార్చారు. ఇప్పటివరకు చేసిన అప్పు మొత్తాన్ని ఐదు నెలలకు సగటున లెక్కకడితే నెలకు సుమారు రూ.10,618 కోట్లు అప్పుల ద్వారా సమీకరించినట్లవుతుంది. అదే సమయంలో ఐదు నెలల్లో రెవెన్యూ ఆదాయం సగటున నెలకు రూ.14,558 కోట్లుగా ఉండగా… రెవెన్యూ వ్యయం నెలకు రూ.21,944 కోట్లకు చేరింది. అంటే ప్రతి నెలా సాధారణ ఆదాయంతో రెవెన్యూ అవసరాలను పూర్తిగా తీర్చలేని పరిస్థితి కనిపిస్తోంది. తొలి ఐదు నెలల్లోనే రెవెన్యూ లోటు రూ.36,932 కోట్లుగా నమోదైంది. తాజాగా మరో రూ.2,600 కోట్లు సమీకరించేందుకు మంగళవారం ఆర్బీఐ వేలంలో ప్రభుత్వం పాల్గొంది. ఇందులో వెయ్యి కోట్లు 7.56 శాతం వడ్డీతో 2039లోపు చెల్లించేలా, మరో రూ.1,600 కోట్లు 7.68 శాతం వడ్డీతో 2051లోపు చెల్లించేలా రుణం తీసుకుంది. ప్రతి నెలా వడ్డీ చెల్లింపులకే నెలకు సగటున రూ.3,107 కోట్లు చెల్లించాల్సి వస్తుండగా… పెన్షన్లకు సుమారు రూ.2,800 కోట్లు అవసరమవుతున్నాయి. ఇవిగాక ప్రభుత్వ ప్రత్యక్ష బకాయిలకు అదనంగా ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర సంస్థలు తీసుకున్న రుణాలకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల భారం పెరుగుతోంది. 2025 డిసెంబరు 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీల మొత్తం రూ.1,77,328 కోట్లుగా అంచనా వేయగా… ఇది జీఎస్డీపీలో దాదాపు 10 శాతంగా ఉండటం గమనార్హం. మరోవైపు ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన బకాయిల చెల్లింపులు కూడా పెద్దమొత్తంలో పేరుకుపోతున్నాయి. రిటైరైన ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించలేకే రిటైర్మెంట్ వయస్సు పెంచుకుంటూ పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నెల 6వ తేదీన ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగులకు సంబంధించిన రూ.30,849 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించామని తెలిపింది. అదే సమయంలో రెండు పెండింగ్ డీఏలను అక్టోబరు 1 నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. వీటితో పాటు ఇతర నిర్ణయాల వల్ల ఖజానాపై ఏడాదికి సుమారు రూ.2,880 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇంకోవైపు ప్రభుత్వ శాఖల కాంట్రాక్టర్ల బిల్లుల బకాయిలు కూడా భారీగానే ఉన్నాయి. ఇటీవల గ్రామీణ నీటి సరఫరా కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం రూ.620 కోట్లు విడుదల చేయగా… ఒక్క విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే దాదాపు రూ.400 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పల్లేకుండా రాష్ట్ర ఖజానా నడవని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ఆదాయం, వ్యయం మధ్య రోజురోజుకూ అంతరం పెరిగిపోతుండటంతో ఆర్థిక నిర్వహణ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఈ ఏడాది బడ్జెట్ ప్రకారం అప్పులు మినహాయించి ఏడాదికి రూ.2.34 లక్షల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా… రెవెన్యూ వ్యయం రూ.2.56 లక్షల కోట్లకు పైగా ఉంది. దీనికి వడ్డీలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు, జీతాలు, రుణాల తిరిగి చెల్లింపులు తోడవుతున్నాయి. మరోవైపు మూలధన వ్యయాన్ని పెంచుతూ మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండటంతో ఇటీవల కాగ్ గణాంకాల్లోనూ అప్పలపై ఆందోళన వ్యక్తమైంది.


