. జైలునుంచి పాలన సాగిస్తారా?
. బీహార్ సభలో ప్రధాని మోదీ
. కాంగ్రెస్, ఆర్జేడీపై తీవ్ర విమర్శలు
గయ (బీహార్): అవినీతిపై తమ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజుల్లోగా బెయిల్ పొందలేకపోతే… 31వ రోజున తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం తీసు కొచ్చిన మూడు కొత్త బిల్లులను ఆయన గట్టిగా సమర్థించారు. శుక్రవారం బీహార్‌లో పర్యటించిన ప్రధాని మోదీ… వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభించిన అనంతరం ప్రసంగి స్తూ… ఈ కొత్త చట్టాలను చూసి ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతు న్నాయో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అవినీతి నిరోధక బిల్లుల పరిధిలోకి దేశ ప్రధాని కూడా వస్తారని ఆయన గుర్తుచేశారు. ‘‘ఈ చట్టం అమల్లోకి వస్తే, ఏ ముఖ్యమంత్రి, మంత్రి లేదా ప్రధానమంత్రి అయినా అరెస్ట్ అయిన 30 రోజుల్లోగా బెయిల్ తెచ్చుకోవాలి. లేదంటే వారు తమ పదవిని వదులుకోవాల్సి ఉంటుంది’’ అని ప్రధాని వివరించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం… ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి 50 గంటల పాటు అదుపులో ఉంటే సస్పెండ్ అవుతాడని, కానీ ముఖ్యమంత్రులు, మంత్రులు మాత్రం జైల్లో ఉంటూ కూడా అధికార ప్రయోజనాలను అనుభవిస్తున్నారని మోదీ అన్నారు. ఇటీవల కాలంలో జైలు నుంచే ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం చూశామంటూ దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. నాయకుల తీరు ఇలా ఉంటే అవినీతిపై పోరాటం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్య్రం తర్వాత 60-65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అవినీతి కేసులు లెక్కలేనన్ని ఉన్నాయని, కానీ తమ ప్రభుత్వానికి ఒక్క అవినీతి మరక కూడా అంటలేదని మోదీ అన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లాంతరు (ఆర్జేడీని ఉద్దేశించి) పాలనలో బీహార్‌లో పరిస్థితి ఎలా ఉండేదో ఓ సారి గుర్తుంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతమంతా రెట్ భయం గుప్పిట్లో ఉండేదని గుర్తు చేశారు. అర్జేడీ పాలనలో గయా జీ వంటి నగరంతో పాటు రాష్ట్రం మొత్తాన్ని అంధకారంలో నెట్టారని ఆరోపించారు. లాంతర్ పాలనలో సాయంత్రం ఎక్కడికైనా వెళ్లడం కష్టమయ్యేదని ఎద్దేవా చేశారు. విద్యుత్ స్తంభాలు కూడా లేని వేలాది గ్రామాలు ఉండేవన్నారు. విద్య, సరైన ఉపాధి లేక బీహారీలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సి వచ్చేదని విమర్శించారు. కాంగ్రెస్, ఆర్జేడీ ప్రభుత్వాలు ప్రజాధనం విలువను ఎన్నడూ గుర్తించలేదని, తమ ఖజానాలు నింపుకోవడానికే దాన్ని ఉపయోగించాయని ఆరోపించారు. అందుకే వారి హయాంలో ప్రాజెక్టులు ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉండేవని, ప్రాజెక్టు ఆలస్యమయ్యే కొద్దీ దాని నుంచి డబ్బులు దండుకునేవారని ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు.
కోల్‌కతాలో మూడు కొత్త మెట్రో రైలు మార్గాలు
పశ్చిమబెంగాల్లోనూ పర్యటించిన ప్రధాని మోదీ కోల్‌కతాలో మూడు కొత్త మెట్రో రైలు మార్గాలను జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో ఒకటి నేరుగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారితీసే మార్గం కూడా ఉంది. ప్రధానితో పాటు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఉన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ కార్యక్రమాలకు హాజరు కాలేదు.


