Homeవిశ్లేషణఅసమానతల అగాధం

అసమానతల అగాధం

- Advertisement -

భారతదేశంలో అసమానతల అగాధం రోజురోజుకీ పెరుగుతోంది. గత పన్నెండేళ్లలో ఈ పరిస్థితి మరీ దారుణంగా మారింది. దీని ఫలితంగా ప్రజాస్వామిక మనుగడకే సవాలు ఎదురవుతోంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దూసుకుపోతున్నదని 1991 నుంచి చెప్పకుంటున్నాం. ఈ తరుణంలో, మరోవైపు దేశాన్ని లోలోపలే తొలుస్తున్న తీవ్ర ముప్పు ‘ఆర్థిక అసమానతలు’. సంపద సృష్టి జరుగుతున్న మాట వాస్తవమే అయినా, ఆ సంపద కేవలం కొద్దిమంది చేతుల్లోనో కేంద్రీకృతమవుతుండటం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. ఒకవైపు అంతర్జాతీయ స్థాయి కుబేరులు, మరోవైపు కనీస అవసరాలైన కూడు, గూడు, విద్య, వైద్యం కోసం అల్లాడుతున్న కోట్లాది నిరుపేదలు. ఈ రెండు విరుద్ధ ప్రపంచాల మధ్య అంతరం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆర్థిక అసమానత అనేది కేవలం సంపదకు సంబంధించిన గణాంకాల సమస్య మాత్రమే కాదు, అది పరోక్షంగా పౌరుల ప్రాథమిక హక్కులను, ప్రజాస్వామ్య మూలాలను కాలరాసే ప్రమాదకర సామాజిక విపత్తుగా మారుతోంది. ఎన్నో నివేదికలు చెబుతున్న నగ్నసత్యాలివి.
అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు వెల్లడిస్తున్న నివేదికలు భారత ఆర్థిక ముఖచిత్రంలోని అసమానతలను స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి. వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ (డబ్ల్యుఐఎల్) నివేదికను పరిశీలిస్తే, భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న 1 శాతం సంపన్నుల వద్ద దేశ మొత్తం జాతీయ ఆదాయంలో దాదాపు 22.6 శాతం, మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కేంద్రీకృతమై ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ఇది వలసపాలన (బ్రిటీష్ రాజ్) నాటి స్థాయిని మించిపోయిందని నివేదిక పేర్కొనడం గమనార్హం. అంటే బ్రిటీష్ వారి పాలనలోనే అసమానతలతో ప్రజలు అల్లాడిపోయారని చరిత్ర చెపుతున్నది. కానీ అంతకన్నా దయనీయంగా నేటి పరిస్థితులు ఉన్నాయని ఈ నివేదిక నర్మగర్భంగా చెపుతోంది. అదే సమయంలో దిగువన ఉన్న 50 శాతం జనాభా వాటా జాతీయ ఆదాయంలో కేవలం 15 శాతానికి పడిపోయింది. ఇలాంటిదే ఆక్స్‌ఫామ్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ నివేదిక కూడా ఉంది. దేశంలోని అత్యున్నత 10 శాతం ధనికుల చేతుల్లో 77 శాతానికి పైగా జాతీయ సంపద పేరుకుపోయిందని, కింది వర్గాల ప్రజలు చెల్లించే పరోక్ష పన్నుల (జీఎస్‌టీ వంటివి) భారం వారిపై అధికంగా పడుతోందని ఆక్స్‌ఫామ్ స్పష్టం చేసింది. జీఎస్‌టీ సంస్కరణ అత్యంత విఫల ప్రయత్నమని ప్రపంచం ఘోషిస్తున్నా, కేంద్రంలోని ఎన్‌డీఏకు మాత్రం అది చెవికెకక్కడం లేదు. గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ అనే మరో నివేదిక చూస్తే, సంపద వృద్ధి చెందుతున్నప్పటికీ, సంపద కేంద్రీకరణ సూచీ (జీసీ) నిరంతరం పెరుగుతూనే ఉందని పేర్కొంది. అనేక గ్లోబల్ నివేదికలు ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నాయి.
ప్రతిదానికీ అంతమనేది ఉంటుంది. కానీ అసమానతలకు మాత్రం అంతం లేదు. ఇది విపరీత విస్తరణ ధోరణిని కలిగివుంది. దీని వల్ల దారితీస్తున్న ఇతర సమస్యలు కోకొల్లలు. ఈ ఆర్థిక అంతరం కేవలం జీవన ప్రమాణాలకే పరిమితం కాకుండా, సమాజంలోని అన్ని రంగాలపై విష ప్రభావాన్ని చూపుతోంది. అందులో మొదటిది, పౌర, న్యాయ హక్కుల హరణ. రాజ్యాంగం అందరికీ సమాన చట్టం, సమాన రక్షణ కల్పించినప్పటికీ, ఆచరణలో డబ్బు ఉన్నవారికే న్యాయం సులభంగా లభిస్తోంది. పేదరికం కారణంగా న్యాయ పోరాటం చేయలేక జైళ్లలో మగ్గిపోతున్న విచారణ ఖైదీలు ఎందరో ఉన్నారు. ఆర్థిక స్తోమత లేకపోవడం వాక్ స్వాతంత్రాయూన్ని, ఆత్మగౌరవాన్ని కూడా అణచివేసే స్థితికి దారితీస్తోంది. ఇక రెండోది, విద్య, ఆరోగ్య అసమానతలు (సామాజిక వర్గీకరణ). పైవేటీకరణ విస్తరించడంతో నాణ్యమైన విద్య, కార్పొరేట్ వైద్యం ధనికులకే పరిమితమయ్యాయి. పేదలు ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆరోగ్యం కోసం చేసే వ్యయం కారణంగా ప్రతి ఏటా లక్షలాది కుటుంబాలు దారిద్య్రరేఖ దిగువకు నెట్టివేయబడుతున్నాయి. ఇది తర్వాతి తరాల పురోగతిని దెబ్బతీస్తోంది. మూడోది, నిరుద్యోగం, ఉపాధి నాణ్యత లోపించడం. దేశంలో వృద్ధి కనిపిస్తున్నప్పటికీ, అది తగినంత ఉపాధిని సృష్టించని ‘జాబ్‌లెస్ గ్రోత్’ గా మిగిలిపోతోంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది శ్రామికులకు సామాజిక భద్రత, స్థిరమైన వేతనాలు లేకపోవడంతో జీవన ప్రమాణాలు కుంటుపడుతున్నాయి. నాల్గవది, సామాజిక అశాంతి, నేరాల పెరుగుదల. అసమానతలు పెరిగేకొద్దీ అసంతృప్తి, నిరాశ పెరిగి సామాజిక ఘర్షణలకు, నేర ప్రవృత్తికి ఆస్కారం ఏర్పడుతుంది. అవకాశాలు కొందరికే దక్కుతున్నాయనే భావన యువతలో ఆందోళనను రేకెత్తిస్తుంది. ఇటీవల సంభవించిన జెన్జీ ఉద్యమ ఉప్పెన ఇందుకొక ఉదాహరణ. ఇక ఐదవది, రాజకీయాలపై కార్పొరేట్ ఆధిపత్యం. సంపద కొన్ని వర్గాల చేతుల్లోనే పోగుపడటం వల్ల ఎన్నికల వ్యవస్థలో విపరీతమైన ధన ప్రవాహం పెరిగిపోయింది. విధాన నిర్ణయాలు సామాన్యుల కంటే ధనికుల ప్రయోజనాలకు అనుకూలంగా మారే ప్రమాదం పొంచి ఉంది.
ఆర్థిక అసమానతల అంతరాన్ని పూడÌడానికి అవసరమైన కార్యాచరణ లేకపోలేదు. కాకపోతే పాలకుల నిర్లక్ష్యం, ప్రజలు తమను ఏమీ చేయలేరన్న నిర్భీతి ఈ వ్యవస్థను మరింత వెనక్కి నెడుతోంది. సంక్షోభం నుంచి బయటపడటానికి, అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమీకృత ఆర్థిక నమూనా అవసరం. ప్రతి రంగంలోనూ చేపట్టాల్సిన నిర్మాణాత్మక మార్పులంటూ కొన్ని ఉంటాయి. వాటిని కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇందులో పన్ను సంస్కరణలు ప్రధానమైనవి. పన్ను సంస్కరణలంటే జీఎస్‌టీలాంటి రాక్షస సంస్కరణలు కాదు. సంపన్న వర్గాలపై ప్రగతిశీల పన్నులు విధించాలి. వారసత్వ, సంపద పన్నుల అమలు జరగాలి. నిత్యావసరాలపై జీఎస్‌టీ భారం తగ్గించాలి. విద్య, వైద్యరంగాల్లోనూ మార్పులుండాలి. అంటే దానర్థం విద్యను కాషాయీకరించడం కాదు. ప్రభుత్వ జీడీపీలో విద్యకు 6%, ప్రజారోగ్యానికి కనీసం 2.53% నిధుల కేటాయింపు జరగాలి. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల నాణ్యత పెంచాలి. ఉపాధి కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. శ్రమ ఆధారిత తయారీ రంగం, సూక్ష్మచిన్నమధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) ప్రోత్సాహకాలివ్వాలి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల విస్తరణ జరగాలి. సామాజిక భద్రత ఉండాలి. అసంఘటిత కార్మికులకు సమగ్ర పింఛను, ఆరోగ్య బీమా, గిగ్ వర్కర్లకు చట్టబద్ధ రక్షణలు ఉండి తీరాల్సిందే. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి స్థిరమైన నిధులు కేటాయించాలి. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కార్పొరేట్‌ల ఆదేశాల మేరకు తీసుకువచ్చిన సరికొత్త జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి, నరేగా చట్టాన్ని పునరుద్ధరించాలి. రైతాంగ సాధికారత అత్యంత అవశ్యం. వ్యవసాయానికి మద్దతు ధరల చట్టబద్ధత, నిల్వ సౌకర్యాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ద్వారా పట్టణగ్రామీణ అంతరాన్ని తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించాలి. ఆర్థికాభివృద్ధి అనేది కొద్దిమంది ఆస్తుల పెరుగుదలపై కాక, సమాజంలో అట్టడుగున ఉన్న చివరి వ్యక్తి జీవన ప్రమాణాల్లో వచ్చే మార్పుపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ హెచ్చరించినట్లుగా… రాజకీయ ప్రజాస్వామ్యానికి సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం పునాది కాకపోతే ఆ స్వేచ్ఛ ఎక్కువ కాలం నిలవదని నేటి పాలకులు గుర్తెరగాలి. కాబట్టి, సంపద కేంద్రీకరణను అరికట్టి, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం దిశగా దృఢమైన విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. లేకుంటే, జెన్జీ, జెన్ ఆల్ఫా ఉద్యమాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు