గతంలో బీసీలు… ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడినవారిగా అవతారం
డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: డీఎస్సీ-2025 నియామకాల్లో మరో కొత్త తరహా అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గం) కేటగిరీకి అర్హత లేని కొందరు అభ్యర్థులు పత్రాలు పొంది…వాటి ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో బీసీ కేటగిరీల్లో ఉన్న కొందరు అభ్యర్థులు…2025 డీఎస్సీలో ఓసీ కేటగిరీలోని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు పొందడం, వాటి ఆధారంగా ఉద్యోగాలు సాధించినట్లు ఆరోపణలు రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈడబ్ల్యూఎస్‌కు నిర్దేశించిన అర్హతలకు మించిన ఆస్తులు ఉన్నట్లు పేర్కొంటున్న కొన్ని డాక్యుమెంట్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటి వాస్తవికతను అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఆరుగురు అభ్యర్థుల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తూర్పుగోదావరి, వైఎస్సార్ కడప జిల్లాల్లోనూ ఇలాంటి ఆరోపణలు బయటపడినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో గతంలో బీసీ-డీ, బీసీ-ఈ తదితర కేటగిరీల్లో ఉన్న ఆరుగురు అభ్యర్థులు తాజాగా ఈడబ్ల్యూఎస్ పత్రాలు పొంది డీఎస్సీ-2025లో ఉద్యోగాలు సాధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రేవతి, సౌజన్య, రమ్యశ్రీ, కేశవులు, వెంకట లక్ష్మీదేవి, మౌనిక గతంలో బీసీ కేటగిరీలో డీఎస్సీకి దరఖాస్తు చేసినట్లు సమాచారం. వీరిలో కొందరు…2025 డీఎస్సీలో ఉద్యోగం పొందేందుకు తమ కుల కేటగిరీని మార్చుకుని ఈడబ్ల్యూఎస్ కింద దరఖాస్తు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజమండ్రిలోనూ డీఎస్సీ నియామకాల్లో కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన మరో వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. సత్తి రాము, సత్తి శ్రీనివాసరావు అనే అన్నదమ్ములకు..ఇద్దరికీ తండ్రి ఒక్కరే అయినప్పటికీ.. ఒకరికి బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రం ఉండగా, మరొకరికి ఓసీ-ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిలో సత్తి రాము బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉండగా, సత్తి శ్రీనివాసరావు ఓసీ-ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్తో డీఎస్సీ ఉద్యోగం పొందినట్లు సమాచారం. ఒకరికి బీసీ-డీ, మరొకరికి ఓసీ-ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలు ఎలా జారీ అయ్యాయి? సంబంధిత తహసీల్దార్లు ఏ రికార్డులను ప్రాతిపదికగా తీసుకున్నారు? కుటుంబ సభ్యుల కుల వివరాలను పరిశీలించారా? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలంలోని వనిపెంట గ్రామానికి చెందిన వనం మునవPర్ రసూలే అనే అభ్యర్థికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మునవPర్ రసూలే 2008, 2012, 2018 డీఎస్సీలలో బీసీ-ఈ పత్రాల ఆధారంగా డీఎస్సీ పరీక్షలు రాసినట్లు సమాచారం 2025 డీఎస్సీలో మాత్రం ఓసీ కేటగిరీలోని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందారని, దాని ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారని ఆరోపణలు ఉన్నాయి. తనకు రావాల్సిన ఉద్యోగాన్ని కోల్పోయానని అదే జిల్లాకు చెందిన జమీల్ అనే అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ వ్యవహారంపై తగిన ఆధారాలతో రెవెన్యూ అధికారులకు, సీఎం చంద్రబాబుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన తహసీల్దార్ల పాత్ర కూడా కీలకంగా మారుతోంది. గతంలో బీసీ కేటగిరీలో ఉన్న వ్యక్తులు..తాజాగా ఓసీ-ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి మారిన సందర్భాల్లో వారి పాత కుల ధ్రువీకరణ పత్రాలు, కొత్తగా జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ సభ్యుల కుల వివరాలు, రెవెన్యూ రికార్డులు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలి. డీఎస్సీ-2025 నియామకాల్లో ఇప్పటికే పలు రకాల అర్హతలు, రిజర్వేషన్ కోటాలు, ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వ్యవహారంపైనా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరముంది.


