పకడ్బందీగా నీట్ పరీక్ష`పేపర్ లీక్‌ల కట్టడికి పటిష్ట విధానం: సుప్రీం
న్యూఢిల్లీ: పరీక్షల్లో లోపాలు సరిదిద్దడానికి యూపీఎస్సీ తరహా శాస్త్రీయ వ్యవస్థ అవసరమని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ), నీట్ పరీక్షల నిర్వహణ, భద్రతా సంస్కరణలపై బుధవారం విచారణ చేపట్టింది. రాధాకృష్ణన్ కమిటీతో పాటు నందన్ నిలేకని కమిటీ సిఫార్సులకు అనుగుణంగా చేపట్టిన చర్యలపై సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు కేంద్రం తరపు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్షల నిర్వహణలో తాత్కాలిక చర్యలు కాకుండా సమగ్రమైన, శాశ్వతమైన మార్పులు తీసుకురావాలని పేర్కొంది. పరీక్షల భద్రత కోసం జాతీయ స్థాయిలో పటిష్ఠమైన విధానం ఉండాలంటూ ఎన్టీఏతో పాటు కేంద్ర ప్రభుత్వానికి జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ అలోక్ అరాధేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది. నీట్`యూజీ పేపర్ లీక్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, డేటా భద్రతా ప్రోటోకాల్స్‌లో మెరుగుదల, ఎన్టీఏ పనితీరు వంటి అంశాల్లో సంస్కరణలకు అవసరమైన సిఫార్సులు చేసేలా ఏడుగురు సభ్యులతో ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వాన కమిటీని కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసింది. అలాగే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో అత్యున్నత స్థాయి టాస్క్ ఫోన్స్‌ను నీట్ పరీక్షల్లో సంస్థాగత సంస్కరణల కోసం రూపొందించింది. అయితే ఇది సంస్థాగత సమస్య అని, వ్యవస్థీకృతంగా పరిష్కరించుకోవడం అవసరమని రాధాకృష్ణన్ కమిటీ సరైన సూచన చేసిందని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగితాలపై ప్రక్రియ మొత్తం బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో భిన్న దృశ్యం కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దీనికి మెహతా స్పందిస్తూ నీట్ ప్రశ్నపత్రాల ముద్రణ మొదలు… పరీక్ష రోజు విద్యార్థులకు చేరేంత వరకు ప్రక్రియ మొత్తం పకడ్బందీగానే సాగుతున్నదన్నారు. క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయాలని అనేక మంది మోడరేటర్లను కోరుతారని, అందులోని ఏ భాగం ప్రశ్న పత్రంలో ఉంటుందో వారెవరికీ తెలిసే అవకాశం లేదన్నారు. నీట్ పశ్నపత్రాలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుందని, చిన్నపాటి కదలిక కూడా రికార్డు అవుతుందని చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) తరపు న్యాయవాది తన్వీ దూబే దాఖలు చేసిన పిటిషన్ సహా అనేక ఫిర్యాదులను సుప్రీం కోర్టు విచారించింది.


