బొల్లిముంత సాంబశివరావు
భారతదేశం వ్యవసాయిక దేశం. గ్రామీణ జనాభాలో 70శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం పై ఆధారపడి ఉన్నారు. దేశంలోని శ్రామికశక్తిలో 45.5శాతం వ్యవసాయ రంగంలోనే ఉంది. ఈ వాస్తవాన్ని గ్రహిస్తే దేశానికి వ్యవసాయ రంగం ఎంత కీలకమో తెలుస్తుంది. అంతటి కీలకమైన వ్యవసాయ రంగం పాలకుల రైతాంగ విధానాల వల్ల నేడు తీవ్రమైన సంక్షోభంలో ఉంది. సేద్యం గిట్టుబాటు లేక అప్పుల పాలైన రైతాంగం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వారి కుటుంబాల రోదనతో గ్రామీణ ప్రాంతం తల్లడిల్లుతున్నది. ఐతే వ్యవసాయ సంక్షోభానికి, కారణాలు ఇలా ఉన్నాయి.
పెరిగిన సేద్యపు ఖర్చులు : ప్రతి సంవత్సరం సేద్యపు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులలు, డీజిల్ ధరల పెరుగుదలే అందుకు కారణం. 1952లో ఎకరా వరి సేద్యానికి రైతు రూ.52లు ఖర్చు పెడితే, 2014-15 సంవత్సరాల మధ్య వరి, గోధుమ ఖర్చు 17 వేలుకు చేరుకుంది. 2026 నాటికి వరి సేద్యపు ఖర్చు సుమారు 30 నుండి 35 వేల దాకా ఉంది. కౌలు రైతులు అదనంగా కౌలు భూమికి 15 వేలు చెల్లిస్తున్నారు. వాణిజ్య పంట పత్తి ఎకరా ఖర్చు సుమారు 30 నుండి 40 వేలు అవుతోంది. కౌలు రూపంలో అదనంగా కౌలు ఖర్చు కూడా ఉండనే ఉంది.
ఎరువుల భారం : సేద్యంలో ఎరువుల పాత్ర కీలకం. 1970 కి ముందు రసాయనిక ఎరువుల వాడకం లేదు. సాంప్రదాయ ఎరువుల వినియోగమే ప్రధానంగా సేద్యంలో ఉండేది. అందువల్ల ఎరువుల ఖర్చు రైతులకు నామమాత్రంగా, అంటే ఎకరాకి 10 నుండి 50 రూపాయలుగా ఉంది. హరిత విప్లవం ప్రారంభమైన తర్వాత 1970-71లో దేశంలో ఎరువుల వాడకం 2.18 మిలియన్ టన్నులుగా ఉంది. 2023-24 నాటికి దేశంలో ఎరువుల వాడకం సుమారు 601 మెట్రిక్ టన్నులకు చేరింది. సేద్యంలో ఎక్కువగా ఎరువుల వాడకంలో ప్రపంచంలోనే భారత్ రెండవ స్థానంలో ఉంది. నేడు రసాయనిక ఎరువులు వాడందే దిగుబడులు రాని పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. దేశ వ్యవసాయ ఖర్చుల్లో ఎరువుల వాటా 20శాతంగా ఉంది. ఎకరాకు 5 వేల రూపాయల వరకు సేద్యంలో ఎరువుల కింద రైతు ఖర్చు చేస్తున్నాడు.
పెరిగిన ధరలు : హరిత విప్లవం పేరుతో ఎరువుల వాడకం, వాటి ధరలు పెరుగుతూ ఉన్నాయి.1970వ దశకంలో 50 కేజీల బస్తా ధర సుమారు రూ.20 నుంచి 40 లోపు మాత్రమే ఉంటే, 2026 నాటికి రూ.1450 నుంచి 2450 వరకు పెరిగింది. ఇందుకు ఎరువుల్లో స్వయం సమృద్ధి లేకపోవడం, ఎరువుల తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు దిగుమతి చేసుకోవడం, దిగుమతి ధరలు పెరగడం, ఎరువుల ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడం, ధరల నిర్ణయం కంపెనీలకే ఇవ్వడం, పోషక విలువల పేరుతో సబ్సిడీలు తగ్గించడం కారణంగా కనిపిస్తోంది. ఎరువుల ధరల పెరుగుదల సేద్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
పంట నష్టాలు : ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు పంట నష్టం జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం 1.5 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను రైతులు కోల్పోతున్నారు. ఆ మేరకు నష్టాన్ని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. 57 వేల కోట్ల విలువైన కూరగాయలు, 5,156 కోట్ల విలువైన ఉల్లిపాయలు, 5,921 కోట్ల టమోటా, వరి, గోధుమకు 26 వేల కోట్లు, పప్పు ధాన్యాలు, నూనె గింజలకు 18 వేల కోట్లు ప్రతి సంవత్సరం నష్టం జరుగుతోంది. అక్టోబర్ 2025లో కురిసిన భారీ వర్షాల వల్ల వ్యవసాయం, పశుసంవరÆక రంగాలకు 3.55 బిలియన్ కోట్ల నష్టం జరిగింది. పెద్ద ఎత్తున పంటల నష్టం జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యాయి. కొద్దిమందికి మాత్రమే ఉపయోగం లేని పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నాయి.
మద్దతు ధరల మోసం : గిట్టుబాటు లేని మద్దతు ధరలకు వ్యతిరేకంగా రైతాంగం ఆందోళన బాట పట్టడంతో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంట ఖర్చులపై అదనంగా 50శాతం పెంచి మద్ధతు ధరలు ప్రకటిస్తానని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఐతే పంట ఖర్చుల నిర్ణయంలో వంచనకు పాల్పడుతున్నది. ఎకరాకి బ్యాంకులు ఇచ్చే రుణాన్ని, కుటుంబ శ్రమను మాత్రమే సేద్యపు ఖర్చుగా నిర్ణయించి దాని పై 50 శాతం పెంచి మద్ధతు ధరలను నిర్ణయిస్తోంది. ఇది స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకం. మద్దతు ధరలు ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం, వాటికి చట్టబద్ధతను నిరాకరిస్తోంది. పంటల కొనుగోళ్లకు బాధ్యత వహించకుండా రైతులను వ్యాపారుల దోపిడీ గురి చేస్తున్నది.
అప్పుల ఊబిలో రైతాంగం : భారతదేశంలో వ్యవసాయ రంగం పై ఆధారపడిన కుటుంబాల్లో 50.2% కుటుంబాలు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. 2013లో ఒక్కో వ్యవసాయ కుటుంబం పై సగటు అప్పు 47 వేలుగా ఉంటే, 2018-19లో రూ.74,121లకు, 2026 నాటికిì సుమారు లక్ష రూపాయలకు కుటుంబ అప్పు పెరిగింది. అధికార మార్పిడి జరిగిన 66 సంవత్సరాల్లో రైతు సగటు అప్పు 47 వేలు కాగా, 12 సంవత్సరాల మోదీ పాలనలో రైతు కుటుంబ సగటు అప్పు అదనంగా 50 వేల దాకా పెరిగింది. దీన్ని గమనిస్తే ఎన్డీఏ పాలనలో రైతాంగం ఎంతగా అప్పులలో కూరుకుపోయిందో తెలుస్తుంది. ఈ అప్పు ఆంధ్రప్రదేశ్లో 2,35,554 రూపాయలతో దేశంలో అగ్రస్థానంలో ఉండగా, 1,52,113 రూపాయల అప్పుతో తెలంగాణ రెండవ స్థానంలో ఉంది.
రైతుల బలవన్మరణాలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల, సేద్యపు ఖర్చులు పెరగడం, పంటలకు న్యాయమైన మద్దతు ధర లభించకపోవడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం జరగడం వంటి కారణాల వల్ల రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయి, దాన్నుంచి బయటపడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో 1950 నుంచి భారతదేశానికి సంబంధించిన ఆత్మహత్యల గణాంకాలను సేకరిస్తూనే ఉంది. అలాగే 1995 నుండి రైతుల ఆత్మహత్యల డేటాను ప్రచురించింది. భారతదేశంలోని వ్యవసాయరంగంలో ఉన్న రైతుల, వ్యవసాయ కూలీల ఆత్మహత్యల సంఖ్య ఏటా సగటున 10,500 వరకు నమోదవుతున్నది. నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం దేశంలో ప్రతి రోజు దాదాపు 30 మంది రైతులు, కూలీలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 1995 నుండి 2014 మధ్య 2,96,438 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2014-22 సంవత్సరాల మధ్య అంటే తొమ్మిదేళ్లలో 1,00,474 మంది రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణాల పాలయ్యారు.1995 నుంచి ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా రైతులు, వ్యవసాయ కూలీలు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవ లెక్కలు బయటపడితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గణాంకాలను తారుమారు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. బలవన్మరణాలను నివారించే చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. అందువల్ల రైతుల బలవన్మరణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. రైతుల బలవన్మరణాలు ఆగాలంటే, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, డీజిల్ ధరలను తగ్గించే విధానాలు అమలు జరిపి, వాటి పై ఇచ్చే సబ్సిడీలను గణనీయంగా పెంచాలి. ఎరువుల ధరల నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించే విధానాలు అమలుచేయాలి. చిన్న, సన్నకారు రైతుల పంట రుణాలను రద్దు చేయాలి. వ్యవసాయ కూలీలకు భూపంపిణీ చేసి, సేద్యానికి అవసరమైన వాటిని సమకూర్చాలి. వారికి తక్షణం ఉచిత ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పించాలి. పంటలకు న్యాయమైన ధరలు ప్రకటించి, అందుకు చట్టబద్ధత కల్పించి పంట కొనుగోళ్ల బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. వీటిని అమలు చేయాలని రైతులు, వ్యవసాయ కూలీలు ఐక్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉద్యమించాలి.
ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
సెల్ : 9885983526


