డా॥ ముచ్చుకోట సురేష్‌బాబు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌నినో ప్రభావం ఇంకా తగ్గలేదు. వాతావరణంలో తేమశాతం లేదు. అలాగే వానాకాలం మొదలైనా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంత స్థాయిలో నేల సరిగా తడవనేలేదు. దీంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఏరువాకకు ఎల్‌నినో దెబ్బతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖరీఫ్‌కు ఆదిలోనే వాన గండం వచ్చింది. ఖరీఫ్ వ్యవసాయ పనుల ఆరంభానికి ఈ సంవత్సరం ఎల్‌నినో దెబ్బ తగిలింది. ఈమారు తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని మొదట్లోనే వాతావరణ శాఖ హెచ్చరించింది కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లప్తత ధోరణి రైతులను నిండా ముంచింది. మరీ తొలుతనే సమస్య ఉండకపోవచ్చని, జూలై, ఆగస్టు మాసాల్లో తక్కువగా వానలు పడతాయని రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా ఉంది. నైరుతి రుతుపవనాలు ఊహించిన దానికంటే ఐదారు రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించి మురిపించి అంతలోనే ముఖం చాటేశాయి. తొలకరి వానల జాడ లేక సాగు పనులు స్తంభించాయి. మామూలుగా జూన్‌లో వర్షాలు ఆశాజనకంగా కురుస్తాయి. కాని ఈ ఏట సగటు సాధారణ వర్షంలో ఏకంగా తెలంగాణలో 58 శాతం లోటు ఆంధ్రాలో 63.19 శాతం తక్కువ పడింది. జూన్ 1 నుంచి జూన్ 30 వరకు సాధారణ వర్షపాతం 79.24 మిల్లీమీటర్లు కాగా 29.17 మిమీ పడింది. ఎపిలో 28 జిల్లాలుండగా ఏకంగా 17 జిల్లాల్లో అత్యల్ప వర్షం (మైనస్ 60-99 శాతం) తెలంగాణాలో పదిహేను జిల్లాల్లో 59 శాతం మైనస్ కురిసింది. జూన్‌లో రెండు రాష్ట్రాలలో ఏ జిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. తీవ్ర కరువు పరిస్థితులు తెలెత్తినా నైరుతి రుతుపవన కాలం మొదటి నెలలో ఇటువంటి అనావృష్టి లేదని, 124 సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిస్థితి ఉందని మేధావులు రైతులు చెబుతున్నారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణలో అత్యధిక సాగు ఖరీఫ్‌లోనే సాగుతుంది. సీజన్లో దాదాపు 80 లక్షల ఎకరాల్లో, తెలంగాణాలో 68 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటల సాగుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. కూరగాయలు, ఉద్యానవన పంటలతో కలిపితే కోటి ఎకరాల సేద్యం ఒక్క ఖరీఫ్‌లోనే జరుగుతుంది. ఆదిలోనే తీవ్ర వర్షాభావం నెలకొనడంతో మొత్తం సీజన్‌పై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్, నవంబర్‌లో తరచు తుపాన్లు వచ్చి చేతికొచ్చిన పంటలను ఊడ్చిపెడుతున్న అనుభవంతో ఈ తడవ పంట కాలాన్ని కాస్త ముందుకు జరపాలని ప్రభుత్వం ఆశించింది. ముందుగానే కాల్వలకు నీరు విడుదల చేయడానికి క్యాలెండర్ సైతం ప్రకటించింది. కాని జూన్‌లో తీవ్ర వర్షాభావం ఏర్పడటంతో ప్రభుత్వ అంచనాలు తప్పాయి. ప్రధాన జలాశయాలైన శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామరÆయూం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 42 టిఎంసిలే ఉన్నాయి. డెడ్ స్టోరేజిగా పేర్కొంటున్నారు. నాగార్జునసాగర్ ఫుల్ కెపాసిటీ 312 టిఎంసి కాగా ఇప్పుడు 138 టిఎంసి ఉన్నాయి. పులిచింతలలో 45 టిఎంసిలకు 33 టిఎంసి ఉన్నాయి. కృష్ణాపై ఎగువన్ను కర్ణాటక ఆల్మట్టి, నారాయణపూర్‌లోనూ అంతంత మాత్రంగానే నీటి నిల్వలున్నాయి. ఈ తరుణంలో కృష్ణా డెల్టాకు పీట్టిసీమ నీరే దిక్కు. అయితే గోదావరి బేసిన్లో వానల్లేకపోతే వరద రాకపోతే పట్టిసీమ నీటికి సైతం సమస్య నెలకొంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు, తక్కువ కాల వ్యవధిలో పంట చేతికొచ్చే రకాలను సాగు చేయాలని సూచిస్తోంది. ఇదిలాఉండగా, గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పలు మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఆ ప్రభావంతో భూగర్భ జలాలు కిందికి చూస్తున్నాయి. ఒకవేళ విద్యుత్ అందించినా నీటి కొరత తప్పదని ఆవేదన చెందుతున్నారు. వర్షాలు పడకపోతే విద్యుదుత్పత్తికీ అంతరాయం ఏర్పడుతుందన్న భయాలు నెలకొన్నాయి. రాయలసీమ మహబూబ్ నగర్ భూములు ఎక్కువగా వేరుశెనగ, ప్రత్తి, కంది, జొన్న, సజ్జ ఎక్కువగా విత్తడం జరుగుతుంది. రాయితీ విత్తనం ఇచ్చి రెండు నెలలవుతుంది, పురుగు పడుతుంది. ఇప్పటికే చాలా మంది రైతులు నూనెకు, లేదా అంగళ్ళకు విక్రయిస్తున్నారు. విత్తనం పంటకు ప్రాణం విత్తనమే. విత్తులో సత్తువ ఉంటేనే పొలంలో, రైతు ముఖంలో కళకళ, లేకుంటే పెట్టుబడి, శ్రమ అంతా వృధా. నాణ్యమైన విత్తనాలు నాటితే సరైన దిగుబడులు సాధ్యమై రైతుకు గిట్టుబాటు అవుతుంది. వర్షం పడాల్సిన సమయంలో పడితే ప్రయోజనం ఉంటుంది, అకాల వర్షం తో అన్నీ ఇబ్బంది. కూలీలకు పనులు దొరక్క దగ్గరలో బేల్దార్, బిల్డింగ్ పనులకు వెళుతున్నారు. గ్రౌండ్ వాటర్ క్ష్మీణత, ఉపరితల నీటి పరిమితి ఉన్నప్పుడు వ్యవసాయానికి పెద్ద అవరోధం కాన్నుది. పెరుగుతున్న జనాభా, వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, పంట తీవ్రత మరియు భూగర్భ జలాల తగ్గుదల వలన తలసరి నీటి లభ్యత క్రమంగా తగ్గుతుంది. దీనివల్ల సమస్య వేగంగా పెరిగే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాల యొక్క కదలికలలో పెద్ద అంతరం. వర్షం కురిసేట్లు మేఘావృతం అయి ఉంటుంది కానీ వర్షం పడదు. ఈదురు గాలులకు మేఘాలు చెదిరిపోతాయి. పశుగ్రాసానికి ఇబ్బంది, పచ్చి గడ్డి దొరక్క ఎక్కువ ధరకు కొనాల్సిన పరిస్థితి. పాల ఉత్పత్తులు ధరలు పెరుగుతాయి. అనేక ప్రాంతాల్లో తాగునీటి కొరత తీవ్రంగా పెరుగుతుంది. కరువు ప్రభావం ప్రజల జీవన శైలిని దెబ్బతీసేదిగా ఉంటుంది. వలసలు మొదలైతే ఆర్థిక రంగం కుదేలవుతోంది. జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ప్రభుత్వాలు కరువు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి తాగు, సాగు నీరు లేక ప్రజలు, పశుగ్రాసం లేక రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలలో ప్రత్యామ్నాయం చూపాలి. వెంటనే కరువు నివారణ చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలి. కరువు పరిస్థితులు తరచుగా ఏర్పడే ప్రాంతాలను గుర్తించి కరువు నివారణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యచరణ ప్రణాళికను తయారు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలి. రైతులు తీసుకున్న అన్ని రకాల అప్పులు రద్దు చేయాలి. ఉపాధి హామీ పథకం, వాటర్ షెడ్ కార్యక్రమం రైతుల జీవన పరిస్థితులు మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టి, వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలుచేస్తున్న కార్యక్రమాలు, పథకాలపై ప్రజలకు వివరించాలి. సెల్ : 9989988912


