Homeఎవరినీ వదలొద్దు

ఎవరినీ వదలొద్దు

- Advertisement -

ఎరువుల అక్రమ విక్రయాలపై చంద్రబాబు ఆగ్రహం
రైతుల్ని ఇబ్బందిపెడితే ఉపేక్షించమని హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రైతులను ఇబ్బంది పెట్టే ఫెర్టిలైజర్‌ దుకాణదారులు, డీలర్లపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. బహిరంగ మార్కెట్‌లో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అక్రమ విక్రయాలకు పాల్పడే డీలర్లపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నదాతలకు ఎక్కడా ఎరువులు, పురుగుమందుల కొరత రానియొద్దని అధికారులకు సూచించారు. ఎరువులు, పురుగు మందుల కొరతపై సీఎం చంద్రబాబు మంగళవారం వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా అధికారులు గతవారం రోజులుగా నిర్వహించిన సోదాల్లో పెద్దఎత్తున ఎరువుల అక్రమ నిల్వలు బయటపడినట్లు సీఎంకు వివరించారు. ఆగస్ట్‌ 23 నుంచి ఆగస్ట్‌ 31 వరకు మొత్తం 286 విజిలెన్స్‌ బృందాలు 598 దుకాణాల్లో తనిఖీలు చేపట్టాయి. అక్రమంగా విక్రయిస్తున్న రూ.1.83 కోట్ల విలువైన 934 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సీజ్‌ చేశారు. వారిపై 67 కేసులు నమోదు చేశారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన రూ.4.30 కోట్ల 1,911 మె.ట. ఎరువుల అమ్మకాలు తాత్కాలికంగా నిలిపివేస్తూ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 124 కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన మరో 8 దుకాణ యజమానులపై క్రిమినల్‌ కేసులు పెట్టారని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి సీరియస్‌గా స్పందిస్తూ ఎరువుల కృత్రిమ కొరత సృష్టించేవారిని ఉపేక్షించవద్దంటూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం అనంతరం వ్యవసాయశాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. గత ఐదేళ్లలో వారిని ఏనాడూ పట్టించుకోని వైసీపీ నేతలు రైతుల పట్ల కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించామని గుర్తు చేశారు. మిర్చి రైతులకు సమస్య వస్తే వెంటనే కేంద్రమంత్రితో సీఎం మాట్లాడారు. ఎరువుల కొరత వస్తే కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి అవసరమైన కోటాను మంజూరు చేయించారని తెలిపారు. పచ్చి అబద్ధాలు మాట్లాడే ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నందువల్ల మీడియానే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని మంత్రి కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు