. నకిలీ పత్రాలతో నియామకాలు
. షోకాజ్ నోటీసులకు సీఎండీ ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్) పరిధిలోని సబ్-స్టేషన్లలో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన చేపట్టిన షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో భారీ అక్రమాల చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పొరుగు సేవల నియామక ప్రక్రియను ఆసరాగా చేసుకుని, కనీస అర్హతలు లేని అభ్యర్థులు సైతం నకిలీ ధ్రువపత్రాలతో కీలక విద్యుత్ శాఖలో కొలువులు సాధించడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ వ్యవహారంపై వివిధ జిల్లాల నుంచి అందిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) లోతేటి శివశంకర్, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడంతో ఈ కుంభకోణం మూలాలు వెలుగులోకి వచ్చాయి. సంస్థ అంతర్గత విచారణలో భాగంగా అభ్యర్థులు సమర్పించిన విద్యార్హత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించగా, మొత్తం 69 మంది ఐటీఐ (ఎలక్ట్రిషియన్) నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరినట్లు నిర్ధారణ అయింది. సాంకేతిక పరిజ్ఞానం అత్యంత అవసరమైన షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకు అనర్హులు ఎంపిక కావడం సంస్థ నిర్వహణపైనే కాక, ప్రజా భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. జిల్లాల వారీగా ఈ అక్రమాల తీవ్రతను పరిశీలిస్తే, ఉమ్మడి కడప జిల్లాలో గరిష్ఠంగా 38 మంది నకిలీ పత్రాలతో విధుల్లో చేరగా, కర్నూలులో 16 మంది, చిత్తూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, తిరుపతిలో ముగ్గురు, అనంతపురంలో ముగ్గురు, అన్నమయ్య జిల్లాలో ఒకరిని గుర్తించారు. ఈ ఉదంతంపై సీఎండీ శివశంకర్ చర్యలకు ఉపక్రమించారు. అక్రమ మార్గాల్లో విధుల్లో చేరిన సదరు 69 మందిని తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించడంతోపాటు వారిని నియమించిన సంబంధిత అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియలో ఏజెన్సీల పాత్రపై కూడా లోతైన విచారించి, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని..సంబంధిత సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజనీర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీ వెనుక ఏదైనా వ్యవస్థీకృత ముఠా ఉందా?, అనే కోణంలో కూడా అధికారులు దృష్టి సారించారు. విద్యుత్ శాఖ వంటి కీలక రంగంలో నియామక పారదర్శకతపై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తింది. కేవలం అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలపైనే ఆధారపడకుండా, నియామక సమయంలోనే ధ్రువపత్రాల క్షేత్రస్థాయి పరిశీలించి ఉంటే..ఈ పరిస్థితి తలెత్తేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కుంభకోణం బయటపడటంతో మిగిలిన జిల్లాల్లోని నియామకాలను పునఃసమీక్షించే అవకాశం కనిపిస్తోంది.


