తాగునీటి అవసరాల వినియోగానికి కేఆరఎంబీ అనుమతి
నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల అధికారుల అభ్యంతరాలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వేసవిలో తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణా జలాలను కేటాయింపుల మేరకు వినియోగించుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆరఎంబీ) 21వ సర్వసభ్య సమావేశం సూచించింది. హైదరాబాద్ జలసౌదలో మంగళవారం జరిగిన కేఆరఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ఏపీకి 10 టీఎంసీల వినియోగానికి కేఆరఎంబీ అనుమతించింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సాగర్ ప్రాజెక్టు ద్వారా 16 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆరు టీఎంసీల వినియోగానికి కేఆరఎంబీ అంగీకారం తెలిపింది. ఏపీ ఇప్పటికే ఎక్కువ నీరు వాడుకుందని తెలంగాణ అధికారులు కేఆరఎంబీ దృష్టికి తీసుకెళ్లారు. తాము కేటాయింపుల ప్రకారమే నీటిని వినియోగించామని ఏపీ జలవనరుల శాఖ అధికారులు నర్సింహమÖర్తి, సలహాదారుడు వెంకటేశ్వరరావు వివరించారు. వాస్తవానికి ఈనెల 2వ తేదీ తెలంగాణ ప్రభుత్వం తమకు వేసివిలో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 13 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఈ సమావేశంలో డిమాండ్ పెంపు చేస్తూ కోరింది. దీంతో శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ, సాగర్ ప్రాజెక్టు 3 టీఎంసీల నీటి వినియోగానికి అదనంగా కేటాయింపులు లభించాయి. ఏపీ జలవనరుల శాఖ నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా తాగునీటి అవసరాల కోసం మే 31 వరకు 10 టీఎంసీలు విడుదల చేయాలని ఏప్రిల్ 29న కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ప్రస్తుతం అదే మోతాదులో కేటాయించారు.


