Homeఏపీ`యుఏఈ మధ్యపటిష్ట పారిశ్రామిక బంధం

ఏపీ`యుఏఈ మధ్యపటిష్ట పారిశ్రామిక బంధం

- Advertisement -

. షిప్‌బిల్డింగ్‌ నుంచి డేటా సెంటర్ల వరకు అపార అవకాశాలు
. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరిన సీఎం చంద్రబాబు
. దుబాయ్‌లో పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు
. అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి లైబ్రరీకి శోభా గ్రూప్‌ విరాళం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్‌-యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలపడేలా సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులను కోరారు. పెట్టుబడుల సాధనకు, నవంబర్‌ నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానాలు పలికేందుకు యూఏఈలో మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సీఎం చంద్రబాబు దుబాయ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా దుబాయ్‌, అబుదాబి దేశాల్లో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. దుబాయ్‌ ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ సతీష్‌ కుమార్‌ శివన్‌, అబుదాబిలోని ఇండియన్‌ ఎంబసీ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ అమర్నాథ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. దుబాయ్‌ సహా యూఏఈ దేశాల్లోని వివిధ కంపెనీల వివరాలు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉంటుందనే అంశాలపై వారితో చర్చించారు. గ్రీన్‌ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్‌, పెట్రో కెమికల్స్‌, పోర్టులు, లాజిస్టిక్స్‌, ఏవియేషన్‌, ఇండస్ట్రియల్‌ పార్కులు, రియల్‌ ఎస్టేట్‌, డేటా సెంటర్లు, ఆతిధ్య రంగం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీలో వనరులు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. గూగుల్‌ సంస్థ విశాఖలో అతిపెద్ద డేటా ఏఐ హబ్‌ 15 బిలియన్‌ డాలర్లతో పెట్టుబడులు పెడుతోందని సీఎం వారికి వివరించారు. ఏపీకి 1054 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీరప్రాంతంలో పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడిరచారు. ఏపీలో లాజిస్టిక్స్‌ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం వివరించారు. యూఏఈ దేశాల సావరీన్‌ ఫండ్స్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపైనా వారితో ముఖ్యమంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ లో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా దుబాయ్‌ సహా వివిధ దేశాల కంపెనీలకు వివరించి, యూఏఈ -ఏపీ పారిశ్రామిక బంధం ధృఢంగా ఉండేలా చూడాలని కోరారు. అనంతరం వివిధ పారిశ్రామిక సంస్థల అధిపతులతో వరుస భేటీలు జరిపారు. తొలిరోజంతా సీఎం బిజీబిజీగా గడిపారు.
విద్య వైద్య రంగాల్లో యూఏఈ ఆసక్తి
ట్రేడ్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో భారత్‌ దేశానికి యూఏఈ భాగస్వామిగా ఉందని దుబాయ్‌లోని కాన్సులేట్‌ జనరల్‌ సతీష్‌ కుమార్‌ శివన్‌ వివరించారు. ఇరుదేశాల పరస్పర పెట్టుబడులతో బంధం మరింత బలపడిరదని సీఎంకు వివరించారు. మూడేళ్లలో 50 శాతం మేర ఇరుదేశాల మధ్య వాణిజ్యం పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం యూఏఈ టెక్నాలజీ రంగంపై ఎక్కువగా వ్యయం చేస్తోందని భారత్‌ నుంచి వచ్చే నిపుణులకు భారీ ఎత్తున అవకాశాలు ఉన్నాయని సీఎంకు వివరించారు. ప్రస్తుతం యూఏఈ నాన్‌ ఆయిల్‌ ఎకానమీ వైపుగా దృష్టి పెట్టిందని తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పై యూఏఈ 2017లోనే ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిందని సీఎంకు సతీష్‌ కుమార్‌ శివన్‌ తెలిపారు. మరోవైపు యూఏఈలో 23 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు భారత్‌ పెట్టిందని ఇందులో 50 శాతం గత ముడేళ్లలో వచ్చినవేనని యూఏఈలోని డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ ఏ.అమర్నాధ్‌ తెలిపారు. భారత్‌ లోని విద్య వైద్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ ఆసక్తి చూపుతోందని వివరించారు. గ్రీన్‌ ఎనర్జీ, ఫుడ్‌ పార్క్‌ లోనూ యూఏఈ నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అమర్నాధ్‌ తెలిపారు.
అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయ ఏర్పాటుకు శోభా గ్రూప్‌ రూ.100 కోట్ల విరాళం
దుబాయ్‌ లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టీ అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రూ.100 కోట్ల విరాళంతో వరల్డ్‌ క్లాస్‌ లైబ్రరీని నిర్మించనుంది. ఏపీలో పెట్టుబడి అవకాశాలు వివరించేందుకు దుబాయ్‌ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుతో ఆ దేశంలోని శోభా రియాల్టి చైర్మన్‌ రవి మీనన్‌తో భేటీ సందర్భంగా ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని కోరారు. గ్రీన్‌ ఎనర్జీకి రాష్ట్రాన్ని చిరునామాగా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు శోభా గ్రూప్‌ ప్రతినిధులకు చంద్రబాబు వివరించగా, ప్రపంచస్థాయి లైబ్రరీ ఏర్పాటుకు 100కోట్ల విరాళం ప్రకటించారు. రాష్ట్రంలో రియాల్టి రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, అమరావతి, విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా బిజినెస్‌ ఐటీ పార్కులు, మాల్స్‌, హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లతో పాటు ఉన్నతశ్రేణి వర్గాలకు హౌసింగ్‌ ప్రాజెక్టులను చేపట్టేందుకు ఉన్న అవకాశాలను తెలియజేశారు. అనంతరం షరాఫ్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌, షరాఫ్‌ డీజీ సంస్థ వ్యస్థాపకుడు షరాఫుద్దీన్‌ షరాఫ్‌తో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రంలోని మౌలిక వసతులు, మావన వనరుల లభ్యత, అలాగే ఇతర అనుకూలతల గురించి వివరించారు. ఏపీ చేపట్టిన పారిశ్రామిక కారిడార్లలో ఆధునిక లాజిస్టిక్స్‌ పార్క్‌లు, గిడ్డంగులు స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. దీనికి ఆసక్తి చూపిన షరాఫ్‌ గ్రూప్‌ తమ అనుబంధ సంస్థ అయిన హింద్‌ టెర్మినల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టిక్స్‌, గిడ్డంగి సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచింది. ఇందుకోసం రైల్వే, పోర్ట్‌ అనుసంధానం కలిగిన ప్రాంతాన్ని గుర్తించాలని షరాఫ్‌ గ్రూప్‌ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
అనంతరం టాటా వరల్డ్‌ గ్రూపు చైర్మన్‌ రమేష్‌ ఎస్‌ రామకృష్ణన్‌, బుర్జిల్‌ హెల్త్‌ కేర్‌ హోల్డింగ్స్‌ చైర్మన్‌ షంషీర్‌ వయాలిల్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్‌ రెడ్డి, టీజీ భరత్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు