Homeఅంతర్జాతీయంఐరాసలో ఘనంగా అంబేద్కర్ జయంతి

ఐరాసలో ఘనంగా అంబేద్కర్ జయంతి

- Advertisement -

న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని భారత్ ఘనంగా నిర్వహించింది. అనేక దేశాల రాయబారులు, విద్యావేత్తలు, నిపుణులు పాల్గొన్నారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారత శాశ్వత ప్రతినిధి బృందం ఘనంగా స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘అంబేద్కర్ రాజ్యాంగ నైతికత దార్శనికత, బహుపాక్షికతలో దాని ప్రాసంగికత’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. ఈ మేరకు ‘ఎక్స’లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని మాట్లాడుతూ, అంబేద్కర్ ప్రజల్లో రాజ్యాంగ నైతికతను పెంపొందించాలని చేసిన పిలుపు ప్రజాస్వామ్య చింతనలో విశిష్టమైనదని పేర్కొన్నారు. ప్రపంచంలో రాజకీయ విభజనలు, ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆలోచన మరింత ప్రాసంగికమైందని తెలిపారు. ఇది బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసి, ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో సంస్కరణలకు దోహదపడుతుందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగంలోని ముఖ్య లక్షణాలను వివరించిన ఆయన, అది యూఎన్ చార్టర్ సూత్రాలతో అనేక అంశాల్లో పోలికలు కలిగి ఉందని చెప్పారు. అంతర్జాతీయ శాంతి, సహకారం వంటి విలువలు రెండింటిలోనూ ప్రతిఫలిస్తున్నాయని వివరించారు.
అంబేద్కర్ దృష్టిలో బహుళపాక్షికత
సీనియర్ సివిల్ సర్వెంట్, అంబేద్కర్ పరిశోధకుడు రాజశేఖర్ వుంద్రు ఈ సందర్భంగా కీలకోపన్యాసం చేశారు. రెండు ప్రపంచ యుద్ధాలను చూసిన అంబేద్కర్, ఐక్యరాజ్యసమితి స్థాపన ప్రాముఖ్యతను ముందుగానే గ్రహించారని తెలిపారు. భారత రాజ్యాంగానికి ప్రాథమిక సూత్రాలను రూపుదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. రాజ్యాంగ నైతికతను ప్రపంచస్థాయిలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. హార్వర్డ్ డివినిటీ స్కూల్ విజిటింగ్ ప్రొఫెసర్ సంతోష్ రౌత్ మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని సామాజిక, ఆర్థిక మార్పుకు సాధనంగా చూశారని చెప్పారు. వ్యక్తిగత కష్టాలను మానవతా విలువలుగా మార్చుకున్న మహనీయుడిగా ఆయనను అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల రాయబారులు, విద్యావేత్తలు, నిపుణులు హాజరయ్యారు. అంబేడ్కర్ రాజ్యాంగ నైతికత, సామాజిక సమానత్వం, శక్తివంతమైన ప్రజాస్వామ్య దృష్టికోణం నేటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కార్యక్రమంలో స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు