Homeఓబుళాపురం మైనింగ్‌అక్రమాలపై కమిటీ

ఓబుళాపురం మైనింగ్‌అక్రమాలపై కమిటీ

- Advertisement -

విశ్రాంత న్యాయమూర్తి సుధాంశు ధులియా నేతృత్వం
. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలి
. సుప్రీం కీలక ఆదేశాలు

న్యూదిల్లీ: ఓబుళాపురం మైనింగ్‌ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓబుళాపురం గనుల లీజు సరిహద్దులు గుర్తించి… ఎంతమేర ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాలు చేశారో తేల్చేందుకు విశ్రాంత న్యాయమూర్తి సుధాంశు ధులియా నేతృత్వంలో సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం… ఏడుగురితో కమిటీని నియమించింది. కమిటీ సభ్యులుగా కేంద్ర పర్యావరణ సాధికార కమిటీ నుంచి ఒకరు, కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఇద్దరు, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి ముగ్గురు ఉంటారని సుప్రీంకోర్టు తెలిపింది. మూడు నెలల్లో నివేదిక అందించాలని నిర్దేశించింది. తదుపరి విచారణను 2026 జనవరికి వాయిదా వేసింది. గాలి జనార్దనరెడ్డి సోదరులకు అనుకూలంగా వైసీపీ హయాంలో ఇచ్చిన అఫిడవిట్‌ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గాలి బ్రదర్స్‌ మైనింగ్‌ చేసుకోవడానికి అనుమతించవచ్చంటూ 2022లో వైసీపీ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సరిహద్దు వివాదం ముగిసిందని, మైనింగ్‌ కొనసాగించడానికి గాలి బ్రదర్స్‌కు అనుమతి ఇవ్వాలని వైసీపీ సర్కార్‌ అఫిడవిట్‌లో పేర్కొంది. దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అమెకస్‌ క్యూరీ అఫిడవిట్‌ దాఖలు చేశారు. అమెకస్‌ క్యూరీ నివేదికను పరిగణనలోకి తీసుకొని వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, గుంటూరు ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు. ఏపీ, కర్నాటక సరిహద్దుల మధ్య వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని అక్రమంగా వేలాది టన్నుల ఇనుప ఖనిజాన్ని తవ్వి గాలి బ్రదర్స్‌ ఎగుమతి చేశారు. ఈ క్రమంలో గాలి బ్రదర్స్‌కు వ్యతిరేకంగా గతంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై 15 ఏళ్లుగా సుప్రీంలో విచారణ కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు