. రూ.13 వేల కోట్లతో 495 ఎకరాల్లో ఏర్పాటు
. ఏడాదికి మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి
. 2,600 మందికి ఉద్యోగావకాశాలు
. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత పరిశ్రమలలో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక అడుగు వేయనుంది. గత ఏడాది గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఏఎమ్ గ్రీన్ సంస్థకు ఏడాదికి మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగేలా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఏడాదిలోనే కార్యరూపం దాల్చడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం కాకినాడలో శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి ఉదయం 10.30 గంటలకు అమరావతి నుంచి కాకినాడకు వెళతారు. ఉదయం 11.20 గంటలకు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. పునరుత్పాదక శక్తితో.. కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమోనియాను ఏఎమ్ గ్రీన్ సంస్థ ఉత్పత్తి చేయనుంది. బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే గ్రే, బ్లూ అమోనియాకు భిన్నంగా ఈ ఉత్పత్తి జరుగుతుంది. ప్రపంచం మొత్తం డీకార్బనైజేషన్, నెట్-జీరో ఎమిషన్స్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా భవిష్యత్ ఇంధనాలుగా మారుతున్నాయి. కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దేశానికే గర్వకారణంగా నిలవనుంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమోనియా ప్లాంట్‌ను గ్రీన్ ప్లాంట్‌గా అభివృద్ధి చేస్తున్నారు. 2027 చివరికి ఉత్పత్తి జరిగేలా లక్ష్యం పెట్టుకున్నారు. 495 ఎకరాల్లో రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ఏఎమ్ గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా సుమారు 2,600 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు.
ఎగుమతులకు అద్భుత అవకాశం
ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడ పోర్ట్‌కు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గ్రీన్ అమోనియాను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు అద్భుత అవకాశము ంటుంది. ఏఎమ్ గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిపర్ ఎస్‌ఈతో ఒప్పందం కుదుర్చుకుంది. 2028 నుంచి ఏడాదికి 125 కేటీపీఏ గ్రీన్ అమోనియాను ఎగుమతి చేయనుంది. మలేసియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్‌కు చెందిన జీఐసీ, యూఏఈకి చెందిన ఏడీఏఐ వంటి సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందనుంది. అలాగే, కాకినాడలోనే రూ.2,000 కోట్లతో రెండు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్‌ను కూడా ఏఎమ్ గ్రీన్ ఏర్పాటు చేస్తోంది.


