చింతపట్ల సుదర్శన్
అదో గొప్ప సాయంత్రం. అది వర్షాకాలం అయినా ఖాతరు చేయకుండా సూర్యుడు ఆకాశంలో వీధి గుండాలా చెలరేగిపోయి ఇప్పుడిప్పుడే గొప్పగా రంగు మారుస్తున్నాడు. గొప్ప వాళ్లెప్పుడు గొప్ప వాళ్లే కదా. గొప్పగా గొప్పతనం ప్రదర్శించి కొండల చాటుకు వెళ్తున్నాడు.
మైదానంలో నుంచి గొప్పగా అడుగు వేస్తూ వచ్చి గొప్పగా తోక పైకెత్తి చుట్టచుట్టి అరుగు ఎక్కింది డాగీ. ఏమిటి డాగీ తరహామారింది. గొప్పగా ముఖం పెట్టి అరుగు ఎక్కింది అనుకున్న డాంకీ, ఆ మాట అడగకుండా ఉండలేకపోయింది. ఏమిటి బ్రో ఇంత గొప్పగా నీ ముఖం ఉండడం ఎప్పుడూ చూళ్లేదు నేను. అంత గొప్ప ఘనకార్యం ఏంచేసి వచ్చేవేమిటి అని అడిగేసింది.
గొప్పగా కనపడ్డానికి, గొప్ప ముఖం పెట్టడానికి ఘనకార్యాలు చెయ్యాలా ఏమిటి? గొప్పగా ఉండాలనుకుంటే చాలు గొప్పగా ఉండిపోతాం. వేరే ఎవరో మనని గొప్ప వాళ్లని చేస్తారనుకోవడం ఒట్టి భ్రమ, చిత్తచాంచల్యం అంతే అంది డాగీ. అవునా! గొప్పతనం వెనుక ఇంత గొప్ప సైన్సు, ఫిలాసఫీ, రీజనింగూ, లాజిక్కూ, మ్యాజిక్కూ ఉన్నాయన్న మాట అంది డాంకీ. అబ్బ! ఎంత గొప్పగా చెప్పావు గొప్పతనాన్ని గురించి. గొప్పతనాన్ని గురించి ఇంత గొప్పగా విశ్లేషించి, వింగడిరచి చెప్పగలిగిన గాడిద ఎవరైనా నీతో సహా గొప్పవారే. సారీ గాడిద అన్న మాటకు నొచ్చుకోకు, మనుషుల్లోనూ గాడిద అంటే నొచ్చుకునే వాళ్లు కరువైపోయేరు. గొప్ప గాడిద అన్నా సంతోషిస్తారు. గొప్ప అనే మాట మాత్రమే ముఖ్యం వాళ్లకు అని డాగీ అంటుంటే, అరుగు ఎక్కాడు అబ్బాయి.
ఏంటి ‘బ్రో’ ఇద్దరు గొప్పవాళ్ల మధ్యకు వచ్చి కూచుంటున్నావు నువ్వూ మాలా గొప్పవాడివైనట్టే అంది డాంకీ పళ్లున్న నోరు తెరుస్తూ. గొప్పేంటి గొప్ప. నేనేం గొప్పోణ్ణి. అసలు ఎందుకు గొప్పవాడ్ని కావాలి. పెద్ద చదువూ లేదు, ఓ మాదిరి ఉద్యోగమూ లేదు అన్నాడు అబ్బాయి. చదువురాని వాడవని దిగులు చెందకు అని ఓ పాట కూడా ఉంది. చదువు రాకపోతేనేం, రిటైర్మెంటు లేని ఉద్యోగాలుచేసే వాళ్లెందరు లేరు అంది డాంకీ. రిటైర్మెంటులేని గొప్ప ఉద్యోగమంటే, చదువు అక్కర్లేని ఉద్యోగమంటే మంత్రో, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో అంతే కద. అంత గొప్పతనం నాకవసరం లేదు కానీ మీరిద్దరూ గొప్ప వాళ్లమన్నారదేంటో చెప్పండి అన్నాడబ్బాయి. నేను చెప్తా విను బ్రో. మా శునక జాతిలో ఎంత తెలివైన డాగ్స్ ఉన్నాయో తెలీదా? బంతులు మోసుకొచ్చి ఇవ్వడమే కాదు బాంబులు ఏరి పెట్టే డాగులు, పోలీసు డాగులు గొప్ప మిలిటరీ డాగులు లేవా? అంది డాగీ. ఉంటే వాటికీ నీకూ పోలికేమిటి అన్నాడు అబ్బాయి ముఖంలో కొట్టొచ్చేట్టు కొశ్చన్ మార్కు పెట్టి. అదే మరి అర్థం చేసుకోవాలి. జాతి గొప్పదనం జాతికి సంబంధం ఉన్న అందరికీ వర్తిస్తుందన్న మాట. మనకి మనం గొప్ప వాళ్లం కాకపోతేనేం. మన జాతి గొప్పతనం మనదే కదా అని డాగీ అంటుంటే ఈ డాగీ చెప్తుంటే అర్థం అయింది. మనని మనమే గొప్ప చేసుకోవాలని మా జాతిలో కూడా మూటలు మొయ్యడంతో పాటు అనేక త్యాగాలు చేసిన తాతముత్తాత గాడిదలు ఉండే ఉంటాయి కనుక వారి గొప్పతనం వారసత్వంగా గ్రహించి నేనే, నన్ను గొప్పగా డిక్లేర్ చేసుకున్నాను అంది డాంకీ.
ముక్కున వేలు వేసుకున్న అబ్బాయి అన్నాడు మా తాతలు మీసాలకు సంపెంగ నూనె రాసేవారట. ఇప్పుడు నాకు మీసాలకు రాసుకోడానికి పామాయిల్ కూడా లేదే అయినా నేను గొప్పవాడినేనా? అన్నాడు అబ్బాయి. ఖచ్చితంగా. మనుషుల్లో ఇదివరకు ఎంత గొప్ప వాళ్లున్నారో గొప్ప చారిత్రక సినిమాలు, పౌరాణిక గాధలు. మళ్లీ మళ్లీ సినిమాలుగా తీసి జాతి, ఛాతీ పొంగేట్టు చేస్తున్నారు కదా. అసలు మనిషి జాతి ఎంత గొప్పదో కళ్లు మూసుకుని ఊహించుకో నరాల తీగల్లో హైఓల్టేజి కరెంటు ప్రవహిస్తుందో లేదో చూడు అంది డాగీ. ఏం చూస్తాను లెస్తూ దగాకోర్లు, మోసగాళ్లు, కుంభకోణాల ఓనర్లూ, మాట తప్పేటోళ్లూ వీళ్లు గుర్తుకొస్తే గొప్పతనం తుస్సుమనదూ.
అలాగనకు భాయిసాబ్ ప్రపంచంలో మన దేశం ఎకానమీ విషయంలో ఐదవదో నాలుగవదో అంటున్నారు. ఇదివరకంటే గొప్పగా ప్రకాశిస్తుందంటున్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో రేసు గుర్రమైందంటున్నారు ఇవి చాలవా నువ్వు గొప్పోడివని చెప్పుకోడానికి అంది డాంకీ. దేశంలో పది శాతం మంది దగ్గర ఏభై ఏడు శాతం సంపద ఉందంటే ప్రకాశిస్తున్నట్టా. రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, ఆకలి కేకలు పరిష్కారమైనట్టేనా? గొప్పతనం ప్రచారం చేసుకుంటే వచ్చేస్తుందంటావా అన్నాడబ్బాయి చిరకాలంగా ఉద్యోగం రాని నిస్పృహతో.
ఆకలి తీరిందా, ఉద్యోగం వచ్చిందా కాదు. దేశం గొప్పదయింది కనక నీతో సహా అందరూ గొప్ప వాళ్లయినట్టే అంది డాంకీ.
పదిమంది గొప్పవాళ్లయితే మిగతా వాళ్లందరికీ అది అంటిందనే భావించాలి. గొప్పగా గొప్ప గొప్పలు చెప్పుకునే అవకాశం వచ్చిందని సంతోషించాలి అంతే అంది డాగీ.


