విశాలాంధ్ర బ్యూరో – అమరావతి :నకిలీ మద్యం కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్… అతడి సోదరుడు రాముకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం వారు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ మీడియాతో మాట్లాడుతూ… తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు. 83 రోజుల పాటు తనను జైల్లో ఉంచి, ఇష్టం వచ్చినట్లుగా వివిధ జైళ్లకు తిప్పారని వాపోయారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అవసరమైతే నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధమని అన్నారు. తాను తప్ప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తానని, చర్చకు సిద్ధమా అని సీఎం చంద్రబాబుని కూడా కోరానని గుర్తు చేశారు. అయినప్పటికీ కుట్రతో తనను అరెస్టు చేశారని ఆరోపించారు. కేసులు పెడితే వైసీపీ నేతలు భయపడతారని అనుకుంటే అది పొరపాటేనని స్పష్టం చేశారు. తమ నాయకుడు జగన్ నాయకత్వంలో ముందుకు సాగుతామని అన్నారు. దుర్గమ్మ ఆలయంలో తాను తప్ప్పు చేయలేదని శనివారం ప్రమాణం చేస్తానని జోగి రమేష్ తెలిపారు.


