ఇరాన్ ఉద్రిక్తతలతో ఆర్థిక సంక్షోభం
అమరావతి విషయంలో ఏకాభిప్రాయం అవసరం
సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర – గుంటూరు కలెక్టరేట్ : ప్రపంచ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరంగా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ఇతర దేశాలపై ఒత్తిడి, బెదిరింపులు, యుద్ధ వాతావరణం సృష్టించడం ద్వారా ప్రపంచ శాంతిభద్రతలను ప్రమాదంలోకి నెడుతున్నారన్నారు. నాటో దేశాలతో పాటు 63 శాతం మంది అమెరికా ప్రజలు ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. గుంటూరు మల్లయ్యలింగంభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చని రామకష్ణ హెచ్చరించారు. యుద్ధ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్, గ్యాస్ కొరత తలెత్తి భారతదేశంతో పాటు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులపై రామకష్ణ స్పందిస్తూ… రూపాయి విలువ నిరంతరం పడిపోతూ ఒక డాలర్‌కు రూ.94.70లకు పైగా చేరుకోవడం ఆర్థిక వ్యవస్థ బలహీనతను సూచిస్తోందన్నారు. గతంలో రూపాయి విలువపై విమర్శలు చేసిన నాయకులు ప్రస్తుతం మౌనం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా కేంద్రం చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
10 నుంచి పాదయాత్ర:
దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ రైతులకు ఇచ్చే ఆర్థిక సాయం తక్కువగా ఉందని, నాలుగు నెలలకు ఒకసారి ఇచ్చే రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.4 వేలు సాయం సరిపోదని, వ్యవసాయ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో మరింత సహాయం అవసరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్టగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ రామ్ జీ తీసుకువచ్చి నిధులకు కోత పెట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గుంటూరు, కష్ణా, ఎన్టీఆర్, గోదావరి జిల్లాలతో పాటు అనేక జిల్లాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే దాని ప్రభావం కనబడుతుందని చెప్పారు.
రాష్ట్రంలో నిర్మించిన 15 వేల గోకులం షెడ్లకు రూ.300 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఇప్ప్పుడు ఈ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడిందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ పథకం ప్రారంభమైన కొండపల్లి నుంచి ఈ నెల 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
12న జరిగే భారీ బహిరంగ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సహా పలువురు వామపక్ష నాయకులు హాజరుకానున్నారని వెల్లడించారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొని మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు.
అమరావతి విషయంలో ఏకాభిప్రాయం అవసరం
రాజకీయంగా వేర్వేరు అభిప్రాయాలు ఉండటం సహజమే కానీ రాజధాని అంశంలో మాత్రం ఏకాభిప్రాయం అవసరమని రామకష్ణ పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే విషయంలో సీపీఐ మొదటి నుంచే స్పష్టమైన వైఖరితో ఉందని, 1953లోనే విజయవాడ రాజధానిగా ఉండాలని కమ్యూనిస్టు నాయకులు చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి తదితరులు సూచించారని గుర్తుచేశారు. అమరావతి అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్ప్పుడు మద్దతు తెలిపిందని, ఇప్ప్పుడు వివాదాస్పదం చేయకుండా సహకరించాలని కోరారు. అధికార పార్టీ ప్రతిపక్షాన్ని ఒప్పించే విధంగా చర్చలు జరపాలని, రెచ్చగొట్టే విధానాలు అవలంబించకూడదని సూచించారు. రెండో విడత భూముల సేకరణపై రామకష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతుల నుంచి తీసుకున్న భూముల్లోనే రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని, మళ్లీ భూములు సేకరించడం తొందరపాటు నిర్ణయమన్నారు. రైతుల ఆందోళనలను గౌరవించి, వారి విశ్వాసాన్ని దెబ్బతీయకుండా ప్రభుత్వం ముందుకు సాగాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గతంలో ప్రారంభమైన గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ వంటి ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తికాకపోవడం దురదృష్టకరమన్నారు.
కేంద్రంపై ఒత్తిడికి రాజకీయ ఐక్యత అవసరం: ముప్పాళ్ళ
రాజధాని అమరావతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కేంద్ర ప్రభుత్వంపై సమర్థవంతమైన ఒత్తిడి తీసుకురావాలంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు సాగాలని, ప్రధాన విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించి పారదర్శకంగా వివరాలు తెలియజేయడం ద్వారా విస్తృత మద్దతు సాధ్యమవుతుందని అన్నారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతికి అనుకూలమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదలు, కృష్ణా-గోదావరి బేసిన్‌లోని సహజ వాయువు, విశాఖ-పాడేరు అటవీ ప్రాంతాలు, సుదీర్ఘ సముద్ర తీరాన్ని అభివృద్ధి దిశగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ వనరులు కొద్దిమంది కార్పొరేట్ సంస్థలకు పరిమితం కాకుండా, ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా-గోదావరి బేసిన్ సహజ వాయువు ఆదాయంపై రాష్ట్రాలకు 8 శాతం పన్ను విధించే అధికారం ఉన్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, దీన్ని వినియోగిస్తే రాష్ట్రానికి ఏటా రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం లభించే అవకాశం ఉందని ముప్పాళ్ళ తెలిపారు. ఈ అంశంపై కేంద్రాన్ని ఒప్పించేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపాలని కోరారు. గత రెండేళ్లుగా కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో సీపీఐ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర భూగర్భ వనరులను సమర్థంగా వినియోగించి ప్రజాప్రయోజనాలకు దోహదం చేసే విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి ముప్పాళ్ళ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.


