Homeట్రంప్‌కు మోదీ దాసోహం

ట్రంప్‌కు మోదీ దాసోహం

- Advertisement -

. నక్సలైట్ల అంతం పేరుతో గిరిజనుల హత్య
. వ్యక్తులను హతమార్చినా సిద్ధాంతాలను చంపలేరు
. కార్పొరేట్లకు ప్రభుత్వ సంస్థలు, భూముల అప్పగింత
. రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం
. గవర్నర్లు కేంద్రానికి దళారులు
. సీపీిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
. ఒంగోలులో ఘనంగా 28వ రాష్ట్ర మహాసభలు

విశాలాంధ్ర బ్యూరో – ఒంగోలు : అంతర్జాతీయంగా దేశాల మధ్య ఘర్షణలు సృష్టించి… రెండు దేశాలకు ఆయుధాలు సరఫరా చేసి… యుద్ధాలను ప్రోత్సహిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ దాసోహమయ్యారని సీపీిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోకూడదని, అలా చేస్తే సుంకాలు పెంచుతామని భారత దేశాన్ని ట్రంప్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటే… ఎందుకు ప్రశ్నించడం లేదో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ఒంగోలు నగరంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా నగరంలోని పురవీధులలో ఎర్రసైన్యం మహా ప్రదర్శన నిర్వహించింది. అనంతరం గుజ్జుల యలమందారెడ్డి, సరళాదేవి ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షత వహించారు. తొలుత సురవరం సుధాకరరెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బహిరంగ సభలో నారాయణ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ… 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా… కోట్లాది ఉద్యోగాలు ఊడగొట్టారని మండిపడ్డారు. స్విస్‌ బ్యాంకు నుంచి నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు ఖాతాల్లో వేస్తామని మోసం చేశారన్నారు. నక్సలైట్లను అంతం చేస్తామని పంతం పట్టిన మోదీ సర్కారు… గిరిజనులను దారుణంగా హత్య చేస్తున్నదని విమర్శించారు. అటవీ భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకు గిరిజనులను దోచేస్తున్నదని పేర్కొన్నారు. నక్సలైట్లను హత్య చేసినంత మాత్రాన వారి సిద్ధాంతాన్ని అంతం చేయలేరని స్పష్టం చేశారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవ్‌ను చంపిన రోజే అదానీకి 22 వేల ఎకరాల భూమి అప్పగించారని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలు తన నియంత పాలనకు అడ్డువస్తున్నాయన్న కారణంతో వాటిని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి పదవి గిరిజన మహిళకు ఇచ్చామని ప్రగల్భాలు పలుకుతూ ఆమె సంతకంతో గిరిజన వ్యతిరేక చట్టాలు చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్లు కేంద్రానికి దళారులుగా తయారయ్యారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని నారాయణ చెప్పారు. ఎన్నో మంచి తీర్పులు ఇచ్చిన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని ఇండియా ఐక్యసంఘటన నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే… ఆయన మావోయిస్టులకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని బీజేపీ దుర్మార్గంగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 30 రోజులు జైలులో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు సైతం పదవులలో ఉండరాదంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కొత్త చట్టం తీసుకొస్తున్నారని విమర్శించారు. ఈ చట్టం ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై తప్పుడు కేసులు బనాయించడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. ఇలాంటి చట్టం వస్తే ప్రథమంగా తన కేసు నుండి బయటపడేందుకు 12 మంది లాయర్లు, సాక్షులను చంపించిన అమిత్‌ షాపై ప్రయోగించాలన్నారు. జీఎస్టీ ద్వారా రూ.22 లక్షల కోట్లు వసూలు చేశామని ప్రధాని మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారని, కార్పొరేట్‌ కంపెనీలకు 33 శాతం నుంచి 23 శాతానికి తగ్గించి… సామాన్యులపై ఐదు శాతం నుండి 18 శాతానికి జీఎస్టీ పెంచడంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సామాన్యుడు వాడే చెప్పులపై జీఎస్టీ పెంచిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. ఎలాగైనా బీహార్‌ ఎన్నికలలో గెలవడానికి దొంగ ఓట్లు చేర్పించుకోవడమే కాకుండా విపక్ష అనుకూల ఓట్లను లక్షల్లో తొలిగించారని నారాయణ విమర్శించారు. ఇలాంటి దుర్మార్గ పాలన సాగిస్తున్న మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు, నితీశ్‌ కుమార్‌ రెండు కాళ్లుగా నిలబడటం సిగ్గుచేటన్నారు. జగన్‌ ప్రభుత్వంలో స్మార్ట్‌ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు… నేడు అవే మీటర్లు అమర్చేందుకు అత్యుత్సాహం చూపించడం నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆత్మగౌరం నినాదంతో ఆవిర్భవించిన టీడీపీని చంద్రబాబు బీజేపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఏడాదికి మూడు పంటలు పండుతూ… పచ్చగా ఉన్న పలాసలో ఆరు వేల ఎకరాలు పోర్టుకు అప్పగించాలని చూడటం సమంజసం కాదన్నారు. చంద్రబాబుకు 100 ఎకరాలు అవసరం ఉంటే 1000 ఎకరాలు కావాలని ఉబలాటపడుతాడన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రోజుకో మాట… పూటకో వేషం వేస్తూ సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బలవంతంగా రైతుల భూములు లాక్కొని బడాబాబులకు అప్పగించాలని చూస్తే మరో పోరాటంతో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వందేళ్ల చరిత్ర గల కమ్యూనిస్టు పార్టీని గ్రామీణస్థాయి నుండి బలోపేతం చేయాలని, చివరిక్షణం వరకు ప్రజా పక్షాన పోరాడిన సురవరం సుధాకరరెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలు పోరాట పటిమను పెంచుకోవాలని సూచించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ సీపీఐ వందేళ్ల చరిత్రలో పేదల కోసం అనేక త్యాగాలు చేసిందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో దేశంలో పాల్గొన్న పార్టీలు రెండేనన్నారు. ఒకటి మహాత్మాగాంధీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ కాగా… మరొకటి ఎర్రజెండా పార్టీ సీపీఐ అన్నారు. సీపీఐతో పాటు ఆవిర్భవించిన ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదన్నారు. బ్రిటిష్‌ వారి అడుగులకు మడుగులొత్తుతూ… తొత్తులుగా వ్యవహరించినట్లు చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని పార్టీ, నాయకులు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ను కీర్తించడం సిగ్గుచేటన్నారు. భగత్‌ సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, అల్లూరి సీతారామరాజు వంటి సమరయోధులను విస్మరించడం తగదన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో దొంగ ఓట్లు ద్వారానే బీజేపీ విజయం సాధించిందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అమ్ముడుపోయిందన్నారు. దీనిపై సాక్ష్యాలతో దొంగ ఓట్లను బయటపెట్టిన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి నోటీసులు ఇస్తూ… బెదిరించాలని చూస్తుందన్నారు.దొంగ ఓట్లపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా కేంద్ర ఎన్నికల సంఘానికి గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ పట్టడం లేదన్నారు. ప్రపంచంలోనే గొప్ప ప్రధాని మోదీ అంటూ చంద్రబాబు కితాబివ్వడాన్ని రామకృష్ణ తప్పుబట్టారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను నెత్తికెత్తుకున్నారని మండిపడ్డారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అని పదేపదే చెప్పుకుంటున్న చంద్రబాబు 22 సార్లు దిల్లీకి వెళ్లి ఏమి సాధించారని నిలదీశారు. ఏడాది కాలంలో చంద్రబాబు రాష్ట్రానికి సాధించిన అభివృద్ధి రూ. రూ.1.75 లక్షల కోట్ల అప్పు అని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ.32 వేల కోట్లు అప్పు తెచ్చారన్నారు. మరో రూ.32 వేల కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి నారాయణ చెబుతున్నారన్నారు. చంద్రబాబు మాత్రం అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.78 వేల కోట్లు అప్పు చేస్తున్నట్లు చెప్పారన్నారు. మంత్రి, ముఖ్యమంత్రి వ్యాఖ్యలలో ఏది వాస్తవమో తెలపాలని డిమాండ్‌ చేశారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగితే చంద్రబాబును తెలుగుజాతి క్షమించదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల వంతున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రానున్న కాలంలో డబుల్‌ ఇంజిన్‌ స్పీడ్‌తో ప్రభుత్వంపై ఇళ్ల స్థలాల కోసం పోరాటానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, పి.హరినాథ్‌ రెడ్డి, జి.ఓబులేసు, పి.రామచంద్రయ్య, జగదీశ్‌, కేవీవీ ప్రసాద్‌, జంగాల అజయ్‌ కుమార్‌, డేగ ప్రభాకర్‌, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు, ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు