Home‘డొనేషన్ల’ మాటున దోపిడి!

‘డొనేషన్ల’ మాటున దోపిడి!

- Advertisement -

. కోట్లు కొల్లగొడుతున్న యాజమాన్యాలు
. నిబంధనల సడలింపు…
. వైద్య కళాశాల అధిపతుల ఆధిపత్యం
. సీట్లకు కోతపడకుండా అక్రమ మార్గాలు
. సిబ్బందినే రోగులుగా చూపుతున్న వైనం
. నిరుపేదలకు శాపంగా కార్పొరేట్‌ వైద్యం
. ప్రభుత్వానికి ఫలితం శూన్యం

విశాలాంధ్ర -సచివాలయం: రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్‌ వైద్య విద్యాసంస్థలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇవన్నీ సీట్ల డొనేషన్ల పేరుతో ఏటా వందల కోట్లు సంపాదిస్తున్నాయి. సామాజిక బాధ్యత నిర్వర్తించడం లేదు. విద్య, వైద్యంపై ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. ముఖ్యంగా ఆరోగ్య రంగానికి సంబంధించి అనేక పథకాల్ని అమలు చేస్తోంది. ఇందుకోసం వందలు, వేల కోట్లు వ్యయం చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడంలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు లభించడం లేదు. గతంలో వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతివ్వాలంటే వరుసగా ఐదేళ్ల పాటు నిర్ణీత సంఖ్యలో పడకలతో కూడిన అన్ని విభాగాల వైద్య నిపుణులతో నిండిన ఆసుపత్రిని నిర్వహించాల్సి ఉండేది. అనంతరం అండర్‌ గ్రాడ్యుయేట్‌ తొలి సంవత్సర ప్రవేశాలకు అనుమతులిచ్చేవారు. తదుపరి ప్రతి ఏటా నిర్ణీత పడకలతో కూడిన ఆసుపత్రిని కొనసాగించాలి. అందులోనూ ఏడాది పొడవునా రోగులుండాలి. ప్రత్యేక నిపుణులతో పాటు అన్ని విభాగాలకు చెందిన అర్హత గల వైద్య బోధకులు సిబ్బందిగా ఉండాలి. ఇందుకోసం కార్పొరేట్‌ ఆసుపత్రులన్నీ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేవి. వైద్య నిపుణులందర్నీ ఈ శిబిరాలకు పంపేవి. గ్రామాల్లో రోగుల్ని పరీక్షించి వైద్యసేవలు అవసరమైన వారిని గుర్తించేవి. తమ సొంత బస్సుల్లోనే వారిని తమ ఆసుపత్రులకు తీసుకొచ్చేవి. వారిని ఇన్‌పేషంట్లుగా చేర్చుకుని వైద్యం అందించేవి. వారికి భోజనం, మందుల్ని ఉచితంగా సమకూర్చేవి. పూర్తిస్థాయిలో స్వస్థత పొందిన తర్వాత తిరిగి తమ బస్సుల్లోనే వారి స్వగ్రామాల్లో వదిలి పెట్టేవి.
ఇలా ప్రభుత్వాలు, వైద్య విద్య విభాగ అధిపతులు, విశ్వ విద్యాలయ నిర్దేశం మేరకు ఏడాది పొడవునా తమకు కేటాయించిన సీట్లకనుగుణంగా పడకలపై రోగులుండేలా చూసుకునేవి. ఉన్నతాధి కారుల తనిఖీల సమయంలో పడకలు ఖాళీగా ఉంటే తమ సిబ్బందిని రోగులుగా చూపిస్తూ పడకలపై పడుకోబట్టేవి. అలాగే అప్పటికప్పుడు కొంతమందిని తెచ్చి రోగులుగా లెక్కల్లో చూపేవి. ఇలా తమ అవసరం కోసం గ్రామీణ స్థాయిలో కార్పొరేట్‌ వైద్య సేవల్ని అందించేవి. క్రమ పద్ధతిలో రోగుల సంఖ్య లేనిపక్షంలో తదుపరి ఏడాదికి సంబందించి వైద్య విద్య సీట్లలో కోత పడేది. తిరిగి ఈ సంఖ్యను పునరుద్దరించుకోవడం ఆషామాషీకాదు. పైగా ఒక్క సీటు తగ్గినా కోట్ల రూపాయల ఆదాయం గల్లంతవుతుంది. దీంతో కార్పొరేట్‌ ఆసుపత్రులన్నీ ఒకప్పుడు గ్రామాల బాటపట్టేవి. ప్రభుత్వం, వైద్య విద్య విభాగాలు ఈ నిబంధనల్ని సడలించేశాయి. వీటిని సక్రమంగా అనుసరించడం లేదు. కార్పొరేట్‌ వైద్య విద్యాసంస్థల అధిపతుల ఆధిపత్యం పెరిగింది. దీంతో అనుబంధ ఆసుపత్రుల్లో పడకలు, రోగులు, పరిశీలన వంటి అంశాలన్నీ పక్కకుపోయాయి.
మరోవైపు అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సెట్‌కు రెండు కోట్లు, పీజీకి ఐదు నుంచి 10 కోట్ల రూపాయల చొప్పున డొనేషన్లు పెరిగాయి. ప్రభుత్వం నిర్దేశించిన బీ కేటగిరి సీట్ల ఫీజులు కూడా లక్షల్లోకి చేరాయి. ఏటా ఒక్కో వైద్య కళాశాల 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు డొనేషన్ల రూపంలో నల్ల డబ్బును సమకూర్చుకుంటున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు