మరోసారి పాక్ దాడి
. తిప్పికొట్టిన భారత బలగాలు బ సాంబా సెక్టార్లో కాల్పులు, పేలుళ్లు
. కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత
న్యూదిల్లీ : భారత్- పాక్ నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జమ్మూకశ్మీర్, పంజాబ్ సరిహద్దులు కాల్పులు, పేలుళ్ల మోతతో దద్దరిల్లాయి. వరుసగా రెండో రోజు శుక్రవారం చీకటి పడగానే డ్రోన్లతో దాడికి పాక్ ప్రయత్నించింది. దీంతో పెద్ద పెట్టున యుద్ధ సైరన్లు మోగాయి. రంగంలోకి దిగిన భారత భద్రతా దళాలు పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొట్టాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, కశ్మీర్లో యూరీ, కుప్వారా, పూంచ్, నౌగామ్ సెక్టార్లలో పాక్ కాల్పులకు తెగబడిరది. ఇక సాంబ సెక్టార్, జమ్మూ, పఠాన్ కోట్, పోఖ్రాన్ లో మరోసారి డ్రోన్లతో పాకిస్థాన్ దాడి చేసింది. పాక్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లోని 24 ఎయిర్ పోర్టులను కూడా కేంద్రం మూసివేసింది. ఈ నెల 15వ తేదీ వరకు మూసివేసి ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు, జమ్మూ కశ్మీర్ లో కాల్పుల మోత కొనసాగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. తమకు కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ లో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సీఎం సూచనలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్ పూర్తిగా బ్లాకౌట్ అయిందన్నారు.
400 డ్రోన్లతో దుశ్చర్య
. ఎంతో సంయమం వహిస్తున్నాం
. విదేశాంగశాఖ వెల్లడి
బ ప్రార్థనా మందిరాలే వారి లక్ష్యం
న్యూదిల్లీ: భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా గురువారం రాత్రి పాకిస్థాన్ చేపట్టిన దాడులపై భారత విదేశాంగ శాఖ వివరాలు వెల్లడిరచింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో పాక్ దాడులు చేసినట్లు తెలిపింది. పాకిస్థాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తోందని వెల్లడిరచింది. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడిరచారు. భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం టర్కీకి చెందిన ‘ఆసిస్‌గార్డ్ సోంగర్’ డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిసిందన్నారు. ‘‘గురువారం రాత్రి రెచ్చగొట్టే చర్యలకు దిగిన పాకిస్థాన్.. నియంత్రణ రేఖ వెంట ఉల్లంఘనకు పాల్పడుతూ దాడులకు తెగబడిరది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. పాకిస్థాన్ నుంచి 300 నుంచి 400 డ్రోన్ల వరకు వచ్చాయి. వీటిలో అనేక డ్రోన్లను కూల్చేశాం. పంజాబ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నాం. ఈ దాడుల్లో అనేకమంది గాయపడ్డారు. పాక్ దాడులను భారత వాయుసేన సమర్థంగా అడ్డుకుంది. ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేస్తోంది. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడులు మొదలుపెట్టినప్పటికీ.. అక్కడి పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదు. కరాచీ, లాహోర్ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయి. తమ దాడులకు భారత్ నుంచి ప్రతిస్పందన ఉంటుందని తెలిసీ.. పౌర విమానాలను పాకిస్థాన్ రక్షణ కవచంగా వాడుకుంటోంది. ఇది భారత్-పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో వెళ్లే విమానాలతోపాటు అక్కడి పౌర విమానాలకు సురక్షితం కాదు. అంతర్జాతీయ విమానాలను దృష్టిలో ఉంచుకొని భారత వాయుసేన పూర్తి సంయమనంగా వ్యవహరించింది’’ అని రక్షణశాఖ ప్రతినిధులు కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు వెల్లడిరచారు. ‘పాకిస్థాన్ దాడులకు ప్రతిస్పందనగా, పాక్‌లోని 4 వైమానిక రక్షణ ప్రదేశాలపై సాయుధ డ్రోన్లను ప్రయోగించాం. ఆ డ్రోన్లలో ఒకటి పాకిస్థాన్‌కు చెందిన ఏడీ రాడార్‌ను నాశనం చేసింది. పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి భారీ-క్యాలిబర్ ఆర్టిలరీ తుపాకులు, డ్రోన్లు, ఫిరంగి దాడులకు పాల్పడిరది. దీంతో భారత సైనికులకు కొంత మేరకు నష్టం, గాయాలు అయ్యాయి. అయితే భారత్ దెబ్బకు పాకిస్థాన్ సైన్యం భారీగా నష్టాన్ని చవిచూసింది’’ అని తెలిపారు. భారత్. భారత సైన్యం దేశ సార్వభౌమత్వాన్ని, దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందని.. అన్ని దుర్మార్గపు కుట్రలకు తుత్తునియలు చేస్తామని స్పష్టం చేశారు.